Lalu Prasad: లాలూకు కిడ్నాపర్లతో సంబంధాలు.. రబ్రీదేవీ సోదరుడు సంచలన ఆరోపణలు

by B.Srinivas |

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ పై ఆయన భార్య రబ్రీదేవి సోదరుడు, మాజీ రాజ్యసభ ఎంపీ సుభాష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.

Lalu Prasad: లాలూకు కిడ్నాపర్లతో సంబంధాలు.. రబ్రీదేవీ సోదరుడు సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu prasad Yadav) పై ఆయన భార్య రబ్రీదేవి సోదరుడు, మాజీ రాజ్యసభ ఎంపీ సుభాష్ యాదవ్ (Subhash Yadav) సంచలన ఆరోపణలు చేశారు. లాలూ బిహార్ సీఎంగా ఉన్న టైంలో కిడ్నాపర్లతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. ఆయన ఇంట్లోనే కిడ్నాప్ ఒప్పందాలు జరిగేవని తెలిపారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. లాలూ, ఆయన వ్యక్తులు కిడ్నాప్ లకు పాల్పడేవారని, అనంతరం సెటిల్మెంట్ పూర్తయ్యాక లాలూ ఆదేశాల మేరకు వారిని విడిచిపెట్టేవారని చెప్పారు. అలాంటి వ్యక్తులు తనపైనే కిడ్నాప్ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నాకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే తాను కూడా లాలూ లాగానే జైలుకు వెళ్లేవాడినని స్పష్టం చేశారు. లాలూ ఆదేశం మేరకే తన కుమార్తె వివాహం కోసం కార్లను షోరూమ్ నుంచి తీసుకెళ్లారన్నారు. అధికారం మత్తులో లాలూ ఎవరి మాటా వినలేదని స్పష్టం చేశారు.

సుభాష్ యాదవ్ ఆరోపణలపై రబ్రీదేవీ మరో సోదరుడు సాధు యాదవ్ స్పందించారు. సుభాష్ ఆరోపణలను కొట్టిపారేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. సుభాష్ అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నాడని, అలాంటి ఆరోపణలు చేయడానికి ఏదో రాజకీయ పార్టీ నుంచి డబ్బులు అంది ఉంటాయని విమర్శించారు. అందుకే ఆర్జేడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. సుభాష్‌కు కిడ్నాపర్లతో సంబంధాలు ఉన్నాయని తాను అనుమానిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఏడాది చివరలో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుభాష్ యాదవ్ వ్యాఖ్యలు బిహార్ లో కలకలం రేపాయి.

Next Story