- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ladki Bahin: లడ్కీ బహీన్ స్కీమ్‌లో భారీ స్కామ్..14వేల మంది పురుషులకు రూ.21 కోట్ల లబ్ధి !
మహారాష్ట్రలో ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన లడ్కీ బహీన్ యోజన పథకంలో భారీ స్కామ్ బయటపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన లడ్కీ బహీన్ (Ladki Bahin) స్కీమ్‌లో భారీ స్కామ్ బయటపడింది. ఏకంగా 14000 మంది పురుషులు తప్పుడు పత్రాలతో ఆర్థిక ప్రయోజనాలు పొందారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆడిట్‌లో ఈ విషయం వెల్లడైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తారుమారు చేసి తమకు తాము మహిళలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 14,298 మంది పురుషులకు లడ్కీ బహీన్ స్కీమ్ కింద రూ.21.44 కోట్లు అందజేశారు. అంతేగాక ఈ పథకం ప్రారంభమైన ఏడాది లోపలే లక్షలాది మంది అనర్హులైన లబ్ధిదారులకు చెల్లించడం ద్వారా రాష్ట్రం రూ. 1,640 కోట్లు నష్టపోయిందని ఆడిట్‌లో పేర్కొంది. కాగా, గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన లడ్కీ బహీన్ యోజన పథకం కింద 21 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల కుటుంబాల వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే ఆ మహిళలకు ప్రతి నెలా రూ. 1500 అందిస్తారు. అయితే తప్పుడు పత్రాలతో పురుషులు లబ్ది పొందినట్టు తెలుస్తోంది.
అలాగే ఈ పథకంలో ప్రతి కుటుంబానికి ఇద్దరు మహిళలకు మాత్రమే ప్రయోజనాలను అందించాలని రూల్ ఉంది. కానీ ఓకే ఫ్యామిలీ నుంచి 7.97 లక్షలకు పైగా మహిళలు మూడో లబ్దిదారులుగా ఉన్నట్టు ఆడిట్ లో వెల్లడైంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.1196 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేగాక వయోపరిమితిని నిర్దేశించినప్పటికీ 65 ఏళ్లు పైబడిన 2.87 లక్షల మంది మహిళలకు ఈ స్కీమ్ ప్రయోజనాలు అందుతున్నట్టు తేలింది. ఈ స్కామ్ బయటపడటంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. పేద మహిళలకు సాయం చేయడానికి మాత్రమే లడ్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. పురుషులు దాని లబ్ధిదారులుగా ఉండటానికి ఎటువంటి కారణం లేదని, వారికి ఇచ్చిన డబ్బును తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వారు సహకరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ.. ఈ స్కామ్ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ‘పురుషులు ఫారాలను ఎలా నింపారు. వారికి ఎవరు సహాయం చేశారు. ఏ కంపెనీకి రిజిస్ట్రేషన్ల కాంట్రాక్టు ఇచ్చారు? ఆ కంపెనీపై దర్యాప్తు చేయాలి’ అని పేర్కొన్నారు.






