ఆత్మహత్యాయత్నం.. మర్డర్స్.. యాక్సిడెంట్

by Ajay Maddhiboyina |

రూ.16 కోట్ల మేర అప్పు తేలడంతో ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.

ఆత్మహత్యాయత్నం.. మర్డర్స్.. యాక్సిడెంట్
X

- కోల్‌కతా ట్రిపుల్ మర్డర్ కేసులో ట్విస్టులే ట్విస్టులు

- పోలీసుల ఎదుట ఒప్పుకున్న నిందితుడు ప్రసూన్ డే

- నిందితుడి వాంగ్మూలం విని నివ్వెరపోయిన పోలీసులు

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు ప్రసూన్ డే విచారణ సందర్భంగా చెబుతున్న విషయాలు విని పోలీసులే నివ్వెరపోతున్నారు. ఫిబ్రవరిలో కోల్‌కతాలో జరిగిన మూడు హత్యల వెనుక రూ.16 కోట్ల అప్పే కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ప్రణయ్ డే, ప్రసూన్ డే సోదరులు. కోల్‌కతాలో వీరి తండ్రి ప్రారంభించిన వ్యాపారాన్ని సోదరులు ఇద్దరూ చూసుకునే వారు. తండ్రి విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహించినా.. సోదరుల చేతికి వచ్చిన తర్వాత మాత్రం నష్టాల బాట పట్టింది. వ్యాపారాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా.. విలాసాలు అలవాటు పడ్డారు. తరచూ విదేశాలకు కుటుంబంతో సహా పర్యటనలకు వెళ్లేవారు. ఈ క్రమంలో వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయి. పైగా రూ.16 కోట్ల మేర అప్పు తేలడంతో ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.

కోల్‌కతాలోని తంగ్రా ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల భవనంలో ఫిబ్రవరి 17న ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు. ప్రసూన్, సోదరుడు ప్రణయ్, వదిన సుధేష్ణ, భార్య రూమీ ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే ఒక వేళ ఆత్మహత్య విఫలం అయితే ప్లాన్ బీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత కూడా ఉదయాన్నే బతికి ఉంటే ఒకరిని ఒకరు చంపుకోవడానికి సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు.అయితే ఫిబ్రవరి 17న నిద్రమాత్రల కారణంగా ఎవరూ చనిపోలేదు. దీంతో ఫిబ్రవరి 18న ప్రసూన్, అతని భార్య రూమీ కలిసి 14 ఏళ్ల కూతురిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత రూమీ, సుధేష్ణల మణికట్టు, గొంతులు కోసి ప్రసూన్ హత్య చేశాడు. కాగా, ఈ తతంగం అంతా రెండో అంతస్థులో జరుగుతుండగా.. మూడో అంతస్తులో అతని సోదరుడు ప్రణయ్, కుమారుడు ఉన్నారు. ప్రణయ్‌కు కింది అంతస్తులో ఏం జరుగుతుందో తెలుసని ప్రసూన్ పోలీసులకు వెళ్లడించాడు.

హత్యలు చేసిన తర్వాత ప్రసూన్ నిద్ర మాత్రలు మింగి కింది అంతస్థులోనే నిద్రపోయాడు. ఆ తర్వాత కిందికి వచ్చిన ప్రణయ్, అతని 15 ఏళ్ల కుమారుడు తమ తర్వాతి ప్లాన్ ఎగ్జిక్యూటీవ్ చేశారు. వారిద్దరూ కారులో వేగంగా వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టారు. యాక్సిడెంట్‌లో చనిపోవాలన్నది వారి ప్లాన్. కానీ వారు గాయాలతో బయటపడ్డారు. ఈ యాక్సిడెంట్ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ట్రిపుల్ మర్డర్‌లు వెలుగులోకి వచ్చాయి. కాగా, ప్రస్తుతం ప్రణయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత అన్నదమ్ములిద్దరినీ కలిపి విచారిస్తామని పోలీసులు చెప్పారు. అన్నదమ్ములకు రూ.16 కోట్ల అప్పు ఉందని, అలాగే వారి ఇల్లు కూడా తాకట్టులోనే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వారికి మూడు కార్లు ఉండగా.. వాటిలో రెండు కార్లకు సంబంధించి రూ.47 లక్షల ఈఎంఐ పెండింగ్‌లో ఉన్నట్లు జాయింట్ కమిషనర్ రూపేశ్ కుమార్ వెల్లడించారు. కాగా, ప్రాణాలతో బయటపడిన ప్రణయ్ కుమారుడికి ఆశ్రయం ఇచ్చేందుకు వారి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాలుడిని చిల్ట్రెన్స్ హోమ్‌కు తరలించారు.

Next Story