లోక్‌సభ నుంచే జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తాం: కిరణ్ రిజిజు

by Phanindra |   (  Updated:2025-07-25 16:50:10  IST  )

లోక్‌సభ నుంచే జస్టిస్ వర్మ అభిశంసన ప్రారంభిస్తామని కిరణ్ రిజిజు చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని జంక్ చేస్తున్నారని సమాచారం.

లోక్‌సభ నుంచే జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తాం: కిరణ్ రిజిజు
X

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేస్తుందని సమాచారం. ఈ అంశంపై విచారణ చేసేందుకు ఒక త్రిసభ్య కమిటీని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏర్పాటు చేయనున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియ లోక్‌సభ నుంచే మొదలవుతుందని ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాలన శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు. న్యాయవ్యవస్థలో అక్రమాలపై అన్ని పార్టీలూ కలిసి చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారు.

ఈ క్రమంలోనే రాజస్యభలో ప్రతిపక్షాలు ఇదే అభిశంసనపై రాజ్యసభ చైర్మన్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు అందజేసిన తీర్మానాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ధన్‌ఖడ్ స్వీకరించిన తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టలేదు కాబట్టి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోరని సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే అడ్వాంటేజీ ప్రతిపక్షాలకు ఇవ్వకూడదని, ఈ విషయాన్ని తామే ముందుండి నడిపించాలని బీజేపీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే అభిశంసన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపై ప్రతిపక్షాలతో కూడా సంప్రదించాక కొందరు విపక్ష ఎంపీలు కూడా ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. అయితే రాజ్యసభలో ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదన చేశాయని ధన్‌ఖడ్ పేర్కొనడంతో కేంద్ర ప్రభుత్వం ప్లాన్లన్నింటిపై నీళ్లు కుమ్మరించినట్లయింది. ఇది అధికార బీజేపీకి ఆగ్రహం తెప్పించిందని, అందుకే ధన్‌‌ఖడ్‌ చేత రాజీనామా చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్యసభలో ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానంపై ఎలాంటి చర్చ జరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ అంశంపై లోక్‌సభ నుంచి చర్యలు ప్రారంభించేందుకు అవకాశం దొరికిందని నిపుణులు చెప్తున్నారు.

Next Story