- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిజు vs ఓవైసీ.. మైనార్టీల లబ్ధిపై సోషల్ మీడియాలో వార్
మైనార్టీలకు దక్కుతున్న లబ్ధిపై సోషల్ మీడియాలో రిజిజు, ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ వెనక్కి తగ్గలేదు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. భారత్‌లో మెజార్టీ హిందువుల కంటే మైనార్టీలకే ఎక్కువ లబ్ధి చేకూరుతోందని రిజిజు పోస్టు పెట్టారు. ఒక ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రధాని మోడీ సర్కారు అందర్నీ కలుపుకొని పోతుందని, ఈ క్రమంలోనే మెజార్టీతో పోలిస్తే తమ ప్రభుత్వంలో మైనార్టీ కమ్యూనిటీలకు అదనంగా నిధులు, సహకారం అందుతోందని చెప్పారు. అదే కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఓవైసీ.. ‘మీరు గణతంత్ర భారతంలో ఒక మంత్రి. రాజు కాదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. సింహాసనం మీద కాదు. మైనార్టీ హక్కులు ప్రాథమిక హక్కు, అది దానం కాదు. ప్రతిరోజూ పాకిస్తానీ, బంగ్లాదేశీ, జిహాదీ, రోహింగ్యా అని పిలిపించుకోవడం లాభమా?’ అని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన రిజిజు.. ‘పక్క దేశాల్లో మైనార్టీలు ఆ దేశాలు వదిలి పారిపోవాలని అనుకుంటున్నారు. భారత్‌లో అలాంటి పరిస్థితి ఎందుకు లేదు? ప్రధాని మోడీ పథకాలు అందరి కోసం. మైనార్టీలకు మా మంత్రిత్వ శాఖ అదనంగా లబ్ధిచేకూరుస్తుంది’ అని చెప్పారు. అయితే భారత్‌లో ఉన్న ముస్లింలు ఇక్కడ ఏదో లాభం ఉందని ఉండటం లేదని, తమ హక్కుల కోసం పోరాడే ధైర్యం ఉంది కాబట్టి ఉంటున్నారని ఓవైసీ బదులిచ్చారు. భారత్‌ను విఫలమైన దేశాలతో పోల్చద్దని హితవుపలికారు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే మైనార్టీలు సంతోషంగా ఉన్నట్లా?’ అని ప్రశ్నించారు. తాము బ్రిటిష్ హయాంలో, దేశవిభజన సమయంలో కూడా పారిపోలేదని, తమను అణగదొక్కాలని చూసే వారికి తాము సహకరించబోమని, అదే సమయంలో వారికి కనిపించకుండా దాక్కోవడం కూడా జరగదని ఓవైసీ పేర్కొన్నారు.






