వీరప్పన్ వర్సెస్ హిడ్మా.. తగ్గేదే లే..!

by Bhoopathi Nagaiah |

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్ వేళ రెండు దశాబ్దాల క్రితం మూడు రాష్ట్రాలను వణికించిన కిల్లర్ వీరప్పన్‌ను గుర్తు చేసుకుంటున్నారు తెలుగు ప్రజలు.

వీరప్పన్ వర్సెస్ హిడ్మా.. తగ్గేదే లే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : వీరప్పన్. ఈ పేరు వింటే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు హడలిపోయిన రోజులు ఉన్నాయి. ఇక పోలీస్ అధికారులకు పైప్రాణాలు పైన్నే పోయేవి. సత్యమంగళం(Satyamangalam Forest), శేషాచలం(Seshachalam Forest) అడవులను కేంద్రంగా చేసుకోని గందపు చెట్లను(Sandalwood smuggling), ఏనుగు దంతాలను స్మగ్లింగ్ (elephant ivory Smuggling) చేసే వీరప్పన్(Veerappan) అత్యంత కౄరమైన బందిపోటుగా పేరుగాంచాడు. అనేక మంది రాజకీయనేతలను, పోలీసులను, అధికారులను హత్య చేసిన వీరప్పన్.. 2000 సంవత్సరంలో కన్నడ కంఠీరవుడు, కన్నడ టాప్ హీరో డాక్టర్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. 108 రోజుల పాటు తన కస్టడీలో ఉంచుకోని కర్ణాటక ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు తీసుకోని ఆ హీరోని వదిలేశాడు. వీరప్పన్‌కు పట్టుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 1991లో పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో ‘ఆపరేషన్ కుకూన్’ను చేపట్టి 2004 అక్టోబర్ 18న మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌కు తమిళ ప్రభుత్వం రూ.100 కోట్లను ఖర్చుపెట్టడం భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది.

కిషన్‌జీ సారథ్యంలో హిడ్మా తొలి అడుగు

వీరప్పన్‌ది గత చరిత్ర. కానీ ఇప్పుడు హిడ్మా కాలం. కేవలం 8వ తరగతి చదివి ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ర్టం, సుక్మా జిల్లా(Sukma District) పూవర్తి(Poovarthi Village)కి చెందిన మాడ్వి హిడ్మా(Madvi Hidma) మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారి ముప్పుతిప్పలు పెట్టాడు. ఆదివాసీ అయిన హిడ్మాకు మావోయిస్టు దళంలో సంతోష్ అనే పేరు కూడా ఉంది. 1981లో జన్మించిన హిడ్మా.. 1990 చివర్లో మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ సారథ్యంలో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. హిందీ, తెలుగు, బెంగాలీ, గోండి, కోయ భాషలను అనర్గళంగా మాట్లాడే హిడ్మా.. దళ సభ్యుడిగా ఉద్యమాన్ని ప్రారంభించి అతి తక్కువ సమయం, అతి చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ-1 కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. బస్తర్(Bastar) ప్రాంతంలో మంచిపట్టు ఉన్న హిడ్మా.. చాలా చురుకైన మావోయిస్టుగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాడు.

మూడంచెల భద్రత నడుమ హిడ్మా

దశాబ్దకాలంగా మావోయిస్ట్ ఉద్యమంలో హిడ్మా అత్యంత కీలక నేతగా పేరుగాంచాడు. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం సైతం హిడ్మా కోసం స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టింది. అయితే హిడ్మాతోపాటు సుక్మా జిల్లాకే చెందిన ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన మల్లా, నిషాద్ వర్గాల యువత ఉద్యమంలోకి వచ్చి రక్షణ బాధ్యతలు చూసుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. అంతేకాక అడవుల భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్‌వర్క్‌లను ఉపయోగించడంలో హిడ్మా సిద్ధహస్తుడు. అందువల్లే పోలీసులు గత కొన్నాళ్లుగా హిడ్మాను పట్టుకునేందుకు ప్రయత్నించినా అతడు తప్పించుకునేవాడు. 2023లో దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో హిడ్మా హతమయ్యాడని ప్రచారం జరిగినా అది ఫేక్ అని తర్వాత తేలింది. ఆ ఎన్‌కౌంటర్ తర్వాత హిడ్మాకు మూడంచెల భద్రతను మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసింది.

తిరుగులేని వ్యూహకర్తగా రికార్డు..

దండకారణ్యాన్ని తన స్థావరంగా చేసుకోని ఉద్యమాన్ని నడిపించిన హిడ్మా.. పోలీసులను, భద్రతా దళాలను మట్టుపెట్టేందుకు తిరుగులేని వ్యూహాలు రచించినట్టు పోలీసుల రికార్డుల్లో నమోదైంది. హిడ్మా స్కెచ్ వేస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాడనేది రుజువైంది. అతను ఎన్నో దాడులు చేసినా.. పోలీసుల రికార్డుల్లో మాత్రం 26 దాడుల్లో కీలక నిండితుడిగా ఉన్నాడు. 2007లో ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి(Attack on CRPF jawans) చేసి పలువురిని హతమార్చడం ద్వారా హిడ్మాకు మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అదే విధంగా 2010లో తడ్‌మెట్లలో మెరుపు దాడి చేయడంతో 76 మంది జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నది. 2013లో జీరామ్‌ఘాటీ(Jeeramghatee) వద్ద కాంగ్రెస్‌ నేతల ఊచకోతలో హిడ్మానే కీలక పాత్ర పోషించారు. 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకోని 27 మందిని హతమార్చాడు. 2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా(Bijapur district) తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకున్న 23 మంది జవాన్లు నేలకొరిగారు.

హిడ్మా టార్గెట్‌గా ఆపరేషన్ కర్రెగుట్ట

మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌(Operation Kagar)తో దేశంలో మావోయిస్ట్‌ల కంచుకోటలు నేలమట్టమయ్యాయనే చెప్పవచ్చు. ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న కర్రెగుట్ట(Karregutta), దంతెవాడ, బస్తర్ వంటి ప్రధాన ప్రాంతాలు ఇప్పటికే భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లాయి. ఆధునిక టెక్నాలజీ సాయంతో దండకారణ్యాలను జల్లెడ పట్టి మరీ మావోయిస్టులను ఏరివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలను గడగడలాడించిన హిడ్మా ఎన్‌కౌంటర్ కావడం మావోయిస్టు పార్టీ మనుగడకు ముప్పే. అయితే రెండు దశాబ్దాల క్రితం వరకు సత్యమంగళం అడవులను కేంద్రంగా చేసుకోని మూడు రాష్ట్రాలను వణికించిన బక్కపలచటి వ్యక్తి వీరప్పన్.. శత్రువులను తన వ్యూహంతో అడవుల్లోకి రప్పించి హతం చేసేవాడు. ఇదే మాదిరిగా హిడ్మా సైతం తన పదునైన స్కెచ్‌లతో భద్రతా బలగాలను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. వీరప్పన్ స్మగ్లర్‌గా స్వలాభం కోసం హత్యలు చేసినా, హిడ్మా మాత్రం మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం పని చేశారు. ఇదే వీరిద్దరి మధ్య ఉన్న తేడా. కానీ శత్రువులను మట్టుబెట్టడంతో ఈ ఇద్దరు బక్క పలచని వ్యక్తులు ఒకే వ్యూహాలను రచించడం కామన్ పాయంట్‌గా చూడవచ్చు.

Next Story