- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒడిషాలో నేపాల్ విద్యార్థిని ఆత్మహత్య
విద్యార్థులు ఆందోళన విరమించి తమ తరగతులకు హాజరు కావాలని యాజమాన్యం కోరింది.

- క్యాంపస్‌ను వదిలి వెళ్లాలని చెప్పిన యాజమాన్యం
- దిక్కు తోచని స్థితిలో విద్యార్థులు
- అధికారులను పంపిన నేపాల్ ప్రధాని ఓలీ
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిషాలోని కలింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)లో బీటెక్ మూడో ఏడాది చదువుతున్న నేపాల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. కేఐఐసీ క్యాంపస్‌లోని హాస్టల్ రూమ్‌లో ప్రక్రితి లామ్సల్ ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో అదే క్యాంపస్‌లో చదువుతున్న నేపాలీ విద్యార్థులు పదుల సంఖ్యలో గుమికూడి ఆందోళన చేపట్టారు. దీంతో ఆ విద్యార్థులందరినీ క్యాంపస్ వదిలి ఇండ్లకు వెళ్లిపోవాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. కాగా, ప్రక్రితిని మాజీ బాయ్ ఫ్రెండ్ వేధింపులకు గురి చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె కజిన్ కూడా యూనివర్సిటీలోని ఒక విద్యార్థి వేధిస్తున్నట్లు గతంలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
నేపాలీ విద్యార్థులను క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలంటూ యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలుసుకున్ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వెంటనే స్పందించారు. ఢిల్లీలోని నేపాల్ దౌత్య కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిషాలోని కేఐఐటీ క్యాంపస్‌కు పంపించి, విద్యార్థులతో మాట్లాడాలని ఆదేశించారు. నేపాల్ విద్యార్థులు క్యాంపస్‌లో ఉండాలా లేదా ఇంటికి వచ్చేయాలా అనే విషయాన్ని తామే నిర్ణయించుకొని చెప్పాలని పీఎం ఓలీ తెలిపారు. వారి ప్రాధాన్యతను బట్టి నేపాల్ దౌత్య అధికారులు తర్వాతి చర్యలు తీసుకుంటారని చెప్పారు. కాగా, చనిపోయిన విద్యార్థిని కుటుంబ సభ్యలకు నేపాల్ దౌత్య కార్యాలయం తమ ప్రగాఢ సానుభూతిని తెలియసేసింది. కేఐఐటీ అధికారులతో పాటు ఒడిషా ప్రభుత్వంతో కూడా టచ్‌లో ఉన్నామని.. విద్యార్థులకు అవసరమైన సాయం చేస్తామని వారు తెలిపారు.
కాగా, విద్యార్థిని ఆత్మహత్య చాలా దురదృష్టకరమని కేఐఐటీ యాజమాన్యం పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే క్యాంపస్, హాస్టల్స్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడించింది. విద్యార్థులు ఆందోళన విరమించి తమ తరగతులకు హాజరు కావాలని యాజమాన్యం కోరింది.






