Khamenei: వారసుడి ఎంపికపై ఖమేనీ కసరత్తు.. బంకర్ నుంచే ముగ్గురి పేర్లు సిఫార్సు !

by B.Srinivas |

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు.

Khamenei: వారసుడి ఎంపికపై ఖమేనీ కసరత్తు.. బంకర్ నుంచే ముగ్గురి పేర్లు సిఫార్సు !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీనీ (Ayatollah Ali Khamenei) మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు ఇటీవల పలు కథనాలు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం ఖమేనీ ఒక రహస్య బంకర్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రాణ భయంతో ముందస్తుగానే ఖమేనీ తన వారసుడి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. బంకర్ నుంచే ఆయన ముగ్గురు మత పెద్దల పేర్లను సూచించినట్టు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా అందులో అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా పేరు లేదని సమాచారం. దీంతో గతంలో ఖమేనీ వారసుడిగా మోజ్తాబా నియామకం కాబోతున్నారనే ప్రచారానికి తెరపడింది.

ప్రాణ భయంతోనేనా ?

86 ఏళ్ల ఖమేనీ ప్రస్తుతం టెహ్రాన్ సమీపంలోని ఓ బంకర్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. అయితే ఇజ్రాయెల్, అమెరికా తనను హత్య చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందనే నివేదికల నేపథ్యంలోనే ఖమేనీ తన వారసుడిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తనకు ఏదైనా హాని జరిగితే తాను సూచించిన ముగ్గురిలో ఒకరిని సుప్రీం లీడర్ చేయాలని తమ దేశ ప్రతినిధులకు సూచించినట్టు సమాచారం. సాధారణ సమయంలో కొత్త సుప్రీం లీడర్‌ను నియమించే ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుంది. పలువురు అభ్యర్థులతో సుధీర్ఘ చర్చలు జరుపుతారు. కానీ ప్రస్తుతం దేశంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నందున ఇస్లామిక్ రిపబ్లిక్, తన వారసత్వాన్ని కాపాడుకోవాలని ఖమేనీ కోరుకుంటున్నారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అగ్ర సైనిక కమాండర్ల స్థానంలో ఖమేనీ కొత్త అధికారులను సైతం నియమించారు.

కుమారుడి పేరు తొలగింపునకు కారణమిదేనా?

మోజ్తాబా ఖమేనీ గత రెండు దశాబ్దాలుగా తన తండ్రితో కలిసి అధికార పీఠానికి దగ్గరగా చేరుకున్నాడు. రివల్యూషనరీ గార్డులతో ఆయనకు లోతైన సంబంధాలున్నాయి. అంతేగాక దేశంలోని మత, రాజకీయ విభాగాల్లోనూ కీలకంగా ఉన్నాడు. దేశ భద్రతా బలగాలపైనా మంచి పట్టుంది. అయినప్పటికీ ఖమేనీ తన వారసుడిగా మోజ్తాబాను సూచించ లేదు. అయితే ఇరాన్ వారసత్వం రాజవంశాన్ని అంగీకరించకపోవడమే ప్రధాన కారణమని పలువురు భావిస్తున్నారు. 1989లో ఆయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ అయినప్పుడు కూడా తన కుటుంబాన్ని ప్రోత్సహించలేదు. దీంతో ప్రస్తుత పరిణామాల్లో మోజ్తాబాను వారసుడిగా ప్రకటిస్తే ఇరాన్ మొత్తం వ్యవస్థపైనే ప్రభావం పడుతుందని అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.

Next Story