- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగల్లా ఇంట్లోకి వచ్చిన ఖాకీలు..! 22 తులాల బంగారం లూటీ.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రక్షక భటులే దొంగలుగా మారిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రక్షక భటులే దొంగలుగా మారిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఒక వ్యాపారి ఇంట్లో సోదాల పేరుతో చొరబడి ఏకంగా 22 తులాల బంగారాన్ని లూటీ చేయడంతో పాటు, డిజిటల్ లంచాలకు పాల్పడిన ఐదుగురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి, మాస్టర్ కీతో తలుపులు తెరిచి వారు దొంగల్లా ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగుచూడటంతో ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసు వివరాల ప్రకారం.. వ్యాపారి గౌరవ్ జైన్, ఓ రిటైర్డ్ ఏసీపీ (రాకేశ్ గుప్తా) మధ్య రూ. 65 లక్షల ఆస్తి (హోటల్ నిర్మాణం) వివాదం నడుస్తోంది. దీనికి సంబంధించిన వారెంట్ ఇచ్చేందుకు ఏప్రిల్ 1న లసూడియా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సంజయ్ విష్ణోయ్‌తో పాటు మరో నలుగురు పోలీసులు (రణ్‌వీర్ కుష్వాహ, ప్రణీత్ భదౌరియా, దినేశ్ గుర్జర్, దీపేంద్ర మిశ్రా) బాధితుడి ఇంటికి వెళ్లారు. వీరు ఇంట్లోకి వెళ్లే ముందు సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి, మాస్టర్ కీతో తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించారు. సోదాల అనంతరం తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, ఆ సమయంలో తన ఇంట్లో ఉన్న 22 తులాల బంగారం, మొబైల్, వాచ్ మాయమయ్యాయని గౌరవ్ జైన్ ఆరోపించారు.
అక్రమ నిర్బంధం.. డిజిటల్ లంచం..
తనను ఏప్రిల్ 2 వరకు పోలీస్ స్టేషన్‌లోనే అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత గ్వాలియర్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌కు తరలించి రిటైర్డ్ ఏసీపీ మనుషులతో కొట్టించారని బాధితుడు ఫిర్యాదు చేశారు. కోర్టు నుంచి బెయిల్ పొందిన అనంతరం ఇండోర్ చేరుకున్న ఆయన.. రాకేశ్ శర్మ అనే మరో పోలీసు తన వద్ద డిజిటల్ రూపంలో రూ. 27 వేలు లంచం వసూలు చేశాడని ఆరోపించారు. (క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 10 వేలు, సదరు పోలీసు కుమారుడి ఖాతాకు మరో రూ. 17 వేలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిపారు).
చర్యలు - బాధితుడి డిమాండ్లు
ఏప్రిల్ 16న బాధితుడు పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్, డీసీపీలకు ఫిర్యాదు చేయడంతో, ఏసీపీ పరాగ్ సైనీ నేతృత్వంలో విచారణ జరిపి సదరు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అయితే కేవలం సస్పెన్షన్ సరిపోదని, వారిపై క్రిమినల్ కేసు (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. తన ఆరోపణలను ఎస్ఐ సంజయ్ విష్ణోయ్ ఖండించగా.. న్యాయం జరగకపోతే డీజీపీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వ్యాపారి హెచ్చరించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ‘ఎక్స్’లో షేర్ చేశారు. నిందితులపై ఇంకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించిన ఆయన.. ‘లూటీ చేసిన బంగారం రాష్ట్ర సచివాలయానికి (వల్లభ్ భవన్) చేరుతోందా? అందుకే వారిని కాపాడుతున్నారా?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా, పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది.






