- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు.. లోహగడ్ ఫోర్ట్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేకు చెందిన 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Ketan Agarwal Murder Case) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేకు చెందిన 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)లను ఆదివారం హత్య జరిగిన లోహగడ్ ఫోర్ట్‌కు తీసుకెళ్లి ‘క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్’ నిర్వహించారు. జూన్ 18న హత్య ఎలా జరిగిందో కచ్చితంగా తెలుసుకునేందుకు పోలీసులు ఒక డమ్మీ బొమ్మతో ప్రాక్టికల్స్ చేయించారు. నిందితులు కోట పైకి వెళ్లిన మార్గం, వారు వేచి ఉన్న ప్రదేశం, సియా ఇచ్చిన సిగ్నల్, కేతన్‌ను కొండపై నుంచి కిందకు తోసేసిన విధానాన్ని నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ సమయంలో కోటలోకి పర్యాటకులను అనుమతించలేదు.
కుటుంబ పరువు పోతుందన్న భయం!
కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని సియా.. పెళ్లి రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందన్న భయంతో ప్రియుడితో కలిసి ఈ హత్యకు కుట్ర చేసినట్లు విచారణలో తేలింది. వీరు అంతకుముందు జూన్ 14న కూడా హత్యకు యత్నించి విఫలమైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ప్రత్యక్ష సాక్షులకు తండ్రి విజ్ఞప్తి
సియా తల్లిదండ్రులు ప్రవీణ్, పూజా గోయల్‌తో పాటు ఆమె సోదరుడు సాహిల్‌ను పోలీసులు శనివారం లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్‌లో సుమారు 12 గంటల పాటు విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. మరోవైపు కేతన్‌కు న్యాయం చేయాలని కోరుతూ అగర్వాల్ కుటుంబం నివసిస్తున్న గహుంజేలో స్థానికులు క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. ఘటన జరిగిన రోజు లోహగడ్ ఫోర్ట్‌లో చాలా మంది ఉన్నారని, ఆ రోజు ఏం జరిగిందో చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. ముందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.






