AK-47తో డైరెక్ట్‌గా పోలీసుల ముందుకు.. కీలక మావోయిస్టు నేత మాసే బార్సా సరెండర్

by Kema Shiva Kumar |

‘ఆపరేషన్ కగార్’ ఎండ్ కార్డు పడుతోన్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో మహిళా మావోయిస్టు నేత మాసే బార్సా AK-47 రైఫిల్‌తో కాంకేర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు.

AK-47తో డైరెక్ట్‌గా పోలీసుల ముందుకు.. కీలక మావోయిస్టు నేత మాసే బార్సా సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్‌లో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీలో డివిజనల్ కమిటీ మెంబర్ (DVCM) స్థాయి నేతగా ఉన్న మాసే బార్సా (Massey Barca) బుధవారం కాంకేర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాంకేర్ జిల్లా చింద్‌పాదర్ గ్రామానికి చెందిన మాసే బార్సా, ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి వెన్నదన్నుగా నిలిచారు. తాజాగా ఆమె తన వెంట ఉన్న అత్యంత శక్తివంతమైన AK-47 రైఫిల్‌ను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు.

రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలోనే..

2003 నుంచి సుమారు రెండు దశాబ్దాలకు పైగా మాసే బార్సా దండకారణ్యం, అబూజ్‌మద్ (Abuzmad), ఉత్తర బస్తర్ (North Bastar) అడవుల్లో చురుగ్గా పనిచేశారు. పార్టీలో కీలకమైన మిలిటరీ విభాగాల్లో ఆమె నాయకత్వం వహించారు. అటవీ ప్రాంతం నుంచి ఎలాగోలా బయటపడిన మాసే బార్సా, నేరుగా కాంకేర్ జిల్లా ఎస్పీ (Superintendent of Police) నిఖిల్ రఖేచా వద్దకు చేరుకుని లొంగిపోయారు. మావోయిస్టు పార్టీని విదిలి తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలనే బలమైన ఆకాంక్షతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్పీ నిఖిల్ రఖేచా మాట్లాడుతూ.. మాసే బార్సా వంటి కీలక నేత లొంగిపోవడం మావోయిస్టు వ్యవస్థను మరింత బలహీనపరుస్తుందని అన్నారు. సరెండర్ అయిన వారికి ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల ఆర్థిక సాయంతో తక్షణమే పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ వెల్లడించారు.

Next Story