కేరళ ఇకపై ‘కేరళం’.. పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం

by Ramesh Naini |   (  Updated:2026-02-24 13:22:05  IST  )

కేరళ రాష్ట్రం పేరును ఇకపై అధికారికంగా 'కేరళం' (Keralam) గా మార్చేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది.

కేరళ ఇకపై ‘కేరళం’.. పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రం పేరును ఇకపై అధికారికంగా 'కేరళం' (Keralam) గా మార్చేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. అయితే, రాష్ట్రం పేరును అధికారికంగా కేరళ నుంచి 'కేరళం'గా మార్చాలని కోరుతూ కేరళ శాసనసభ 2024 జూన్ 24న ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పేరు మార్పునకు ఆమోదం తెలిపింది.

‘సేవా తీర్థ్’లో తొలి కేబినెట్ భేటీ..

నూతనంగా ప్రారంభించిన ప్రధానమంత్రి కార్యాలయ (PMO) భవనం 'సేవా తీర్థ్' లో జరిగిన తొలి కేబినెట్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సేవా తీర్థ్‌లో జరిగిన ఈ తొలి సమావేశంతో, ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం 140 కోట్ల మంది దేశవాసులకు సేవ చేసే స్ఫూర్తితోనే ఉంటుందని, దేశ నిర్మాణ విస్తృత లక్ష్యంతో ముడిపడి ఉంటుందని కేంద్ర కేబినెట్ తెలిపినట్లు వ్యాఖ్యానించారు. పౌరుల గౌరవం, సమానత్వం, న్యాయంతో పాలనను అనుసంధానించే నైతిక నిబద్ధతకు రాజ్యాంగ విలువలే మాకు నిదర్శనం అని పేర్కొన్నారు.

మలయాళంలో 'కేరళం'

మలయాళంలో రాష్ట్రాన్ని 'కేరళం' అని పిలుస్తారు. వాస్తవానికి, 2023 ఆగస్టులోనూ కేరళ అసెంబ్లీ ఇదే విధమైన ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే, అందులో కొన్ని సాంకేతిక మార్పులు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సూచించింది. ఆ సూచనల మేరకు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, జూన్ 2024 లో రెండోసారి ఈ తీర్మానాన్ని ఆమోదించి పంపింది. ఎట్టకేలకు దీనికి ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story