- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPIM: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నిక..
సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులోని మధురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలు ఆదివారంతో ముగిశాయి.

దిశ, నేషనల్ బ్యూరో: సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులోని మధురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఈ మహాసభలోనే 85 మంది సభ్యులతో పార్టీ కేంద్ర కమిటీని ఎన్నుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని ఎన్నుకోగా.. 18 మందితో కొత్త పొలిట్ బ్యూరో కూడా ఏర్పడింది. కేంద్రకమిటీలో 20 శాతం మహిళలే ఉండగా.. 8 మంది కొత్త సభ్యులు ఉన్నారు. ప్రకాశ్ కరత్, బృందాకరత్, మాణిక్ సర్కార్, సుభాషిణి అలీలు పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. కొత్తగా ఎన్నికైన పొలిట్‌బ్యూరోలో కేరళ సీఎం పినరయి విజయన్, సీనియర్ నాయకులు బీవీ రాఘవులు, తపన్ సేన్, నీలోత్పాల్ బసు, ఎండీ సలీం, ఎ విజయరాఘవన్, అశోక్ ధావలే, రామచంద్ర డోమ్, ఎంవీ గోవిందన్, అమ్రా రామ్, విజూ కృష్ణన్, మరియం ధావలే, యు వాసుకి, కె బాలకృష్ణన్, జితేంద్ర చౌదరి, శ్రీదీప్ భట్టాచారి, అరుణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. గతేడాది సీతారాం ఏచూరి మృతి చెందినప్పట్నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. దీంతో పార్టీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్ వ్యవహరిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఎంఏ బేబీని సారథిగా నియామకం అయ్యారు.
విద్యార్థి దశలో..
1954లో కేరళలోని ప్రాక్కుళంలో పి.ఎం.అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు ఎం.ఎ.బేబీ జన్మించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరారు. ఆ తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐలలో పలు స్థాయిల్లో పోరాటాల్లో చురుగ్గా పనిచేశారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆతర్వాత కుందర నియోజకవర్గం నుంచి 2006 నుంచి 2016వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే 2006 నుంచి 2011వరకు కేరళ విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 2012 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎంఏ బేబీకి భార్య బెట్టీ లూయిస్, తనయుడు అశోక్ బెట్టీ నెల్సన్ ఉన్నారు. ఇకపోతే, ఏప్రిల్ 2న ప్రారంభమైన సీపీఐ(ఎం) 24వ పార్టీ మహాసభలు ఆదివారం ముగిశాయి.






