జానకి పేరుతో వచ్చిన సమస్యేంటి ? : సెన్సార్ బోర్డుకు కేరళ హైకోర్టు ప్రశ్న

by Naga Rani Yarlagadda |

కేంద్ర చలనచిత్ర ధృవీకరణ బోర్డు (CBFC) ‘జేఎస్‌కే – జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే మలయాళ చిత్రంలో ‘జానకి’ అనే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంపై కేరళ హైకోర్టు (Kerala High Court) శుక్రవారం సందేహాలు వ్యక్తం చేసింది.

జానకి పేరుతో వచ్చిన సమస్యేంటి ? : సెన్సార్ బోర్డుకు కేరళ హైకోర్టు ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర చలనచిత్ర ధృవీకరణ బోర్డు (CBFC) ‘జేఎస్‌కే – జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే మలయాళ చిత్రంలో ‘జానకి’ అనే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంపై కేరళ హైకోర్టు (Kerala High Court) శుక్రవారం సందేహాలు వ్యక్తం చేసింది. సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఉద్దేశించి.. ధ్రువీకరణలో జాప్యం జరిగిందంటూ నిర్మాత సంస్థ ‘కాస్మోస్ ఎంటర్టైన్‌మెంట్’ వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎన్ నాగరేష్ విచారణ నిర్వహించారు.

జానకి అంటే సమస్య ఎందుకు? : న్యాయమూర్తి ప్రశ్న

‘సీతా ఔర్ గీతా’ (Sita Aur Geeta)అనే సినిమా ఉంది. సీత అంటేనే జానకి. అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఎవరికీ సమస్య రాలేదు. ‘రామ్ లక్ష్మణ్’ పేర్లతో సినిమాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ పేరుపై అభ్యంతరం ఎందుకు?” అంటూ న్యాయమూర్తి CBFC తరపున హాజరైన డిప్యూటీ సాలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు.

CBFC మాత్రం చిత్రంలోని ‘జానకి’ అనే పేరు, గౌరవనీయమైన దేవతగా భావించే సీతాదేవితో సంబంధం ఉన్నందున, చిత్రంలో చూపించిన విషయాలు (ఉదాహరణకు లైంగిక హింస వంటివి) గైడ్‌లైన్ 2(xi) – సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 ప్రకారం ఉల్లంఘనకు దారి తీయవచ్చని పేర్కొంది. అందుకే చిత్ర టైటిల్, సంభాషణల నుంచి ఆ పేరును తొలగించాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది.

చిత్ర నిర్మాతల తరపున న్యాయవాది, సినిమాటోగ్రాఫ్ (ధ్రువీకరణ) రూల్స్ 1983 ప్రకారం.. రివైజింగ్ కమిటీకి నోటీసులు జారీ చేయలేరు. కట్‌లను సూచించడమే వారి పరిధి అని వాదించారు. న్యాయస్థానం జూన్ 30న షోకాజ్ నోటీసును కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో చిత్ర నిర్మాతలు స్పందించాలా లేక అప్పీల్ దాఖలు చేయాలా అన్నది వారి ఎంపికగా ఉందని చెప్పింది.

నిర్మాతల ప్రకారం.. జూన్ 12న సినిమా ధ్రువీకరణ కోసం సమర్పించగా, జూన్ 18న స్క్రీనింగ్ పూర్తి చేశారు. కానీ సడెన్‌గా పేరుపై అభ్యంతరం వల్ల సినిమా విడుదల వాయిదా పడిందని, దీంతో ఆర్థికంగా భారీ నష్టాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) – స్వేచ్ఛా ప్రకటన హక్కు, 19(1)(g) – వృత్తి స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు.

Next Story