Kejriwal: యమునా నదిలో విషంపై వివరణ ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు

by B.Srinivas |

ఢిల్లీ అసెంబ్లీ నేపథ్యంలో తీవ్ర చర్చనీయంశమైన యమునా జలాల నీటి వివాదం కొనసాగుతూనే ఉంది.

Kejriwal: యమునా నదిలో విషంపై వివరణ ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ నేపథ్యంలో తీవ్ర చర్చనీయంశమైన యమునా జలాల నీటి వివాదం కొనసాగుతూనే ఉంది. యమునా నీళ్లలో విషం కలిపారని ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ (Election commission) స్పందించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఐదు ప్రశ్నలు సంధించిన ఈసీ వీటిపై సమాధానం ఇవ్వాలని తెలిపింది. ‘హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యమునా నదిలో ఎలాంటి విషాన్ని కలిపింది? దాని ఉనికిని ఎవరు గుర్తించారు? ఎలా, ఎక్కడ కనుగొన్నారు? ఢిల్లీ జల్ బోర్టులోని ఏ ఇంజినీర్ దానిని బయటపెట్టారు?’ అని ప్రశ్నించింది. వీటికి శుక్రవారం 11గంటలలోపు సమాధానం ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలాంటి ప్రకటనలు హర్యానా, ఢిల్లీలో భయంకరమైన పరిణామాలు కలిగిస్తాయని పేర్కొంది. రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచొద్దని స్పష్టం చేసింది. స్వచ్ఛమైన నీటి లభ్యత అనేది పాలనాపరమైన సమస్య అని, అన్ని సమయాల్లో ప్రజలందరికీ సురక్షితమైన నీటిని అందించడానికి ప్రభుత్వాలన్నీ కృషి చేయాలని నొక్కి చెప్పింది.

రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారు: ఈసీకి కేజ్రీవాల్ కౌంటర్

తనకు నోటీసులు పంపడంపై కేజ్రీవాల్ ఈసీకి కౌంటర్ ఇచ్చారు. సీఈసీ రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయన పాలిటిక్స్ చేయాలనుకుంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండునని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వాసులు కలుషిత నీటిని తాగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. తాను బతికున్నంత వరకు ఢిల్లీ ప్రజలను విషపు నీరు తాగనివ్వబోనని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారని తెలుసని, అయినా భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. మీకు ధైర్యం ఉంటే యమునా నీళ్లు తాగాలని ఈసీకి సవాల్ విసిరారు. తమ వద్ద యమునా నీరు నింపిన బాటిళ్లు ఉన్నాయని, వాటిని రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లకి ఒక్కొక్కరికీ పంపిస్తామని దమ్ముంటే వాటిని తాగి చూపించాలని సూచించారు. ఢిల్లీలో డబ్బులు, బెడ్‌షీట్లను బహిరంగంగా పంపిణీ చేస్తున్నా దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Next Story