Kash patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎన్నికైన కాష్ పటేల్ నేపథ్యమిదే?

by B.Srinivas |

అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్​‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతి నేత కాష్ పటేల్ నియామకమయ్యారు.

Kash patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎన్నికైన కాష్ పటేల్ నేపథ్యమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్​‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతి నేత కాష్ పటేల్ (Kaash patel) నియామకమయ్యారు. ఈ మేరకు యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. తాజాగా జరిగిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 51 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 49 వచ్చాయి. దీంతో స్వల్ప మెజారిటీతో గెలిచి ఈ పదవికి ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ ఎంపీలతో పాటు, ఇద్దరు రిపబ్లికన్ ఎంపీలు సుసాన్ కాలిన్స్, లిసా ముర్కోవ్స్కీ డొమటర్ సైతం కాష్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. అయినప్పటికీ రెండు ఓట్ల తేడాతో కాష్ ఎఫ్ బీఐ డైరెక్టర్ అయ్యారు. దీంతో ఎఫ్​‌బీఐ డైరెక్టర్‌ పదవి చేపట్టిన తొలి భారత సంతతి నేతగా ఆయన రికార్డు సృష్టించారు.

ఈ నియామకంపై ఆయన స్పందిస్తూ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నన్ను నియమించడం గౌరవంగా ఉంది. మీ అచంచలమైన నమ్మకం, మద్దతుకు అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండికి ధన్యవాదాలు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘జీ-మెన్ నుంచి 9/11 దాడుల తర్వాత దేశాన్ని రక్షించడం వరకు ఎఫ్‌బీఐకి అద్భుతమైన వారసత్వం ఉంది. అమెరికన్ ప్రజలు పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడి ఉండే ఎఫ్‌బీఐకి అర్హులు. అమెరికన్లు గర్వించదగిన సంస్థగా ఎఫ్‌బీఐని పునర్: నిర్మిస్త’ అని తెలిపారు. అమెరికన్లకు హానీ చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. ఎఫ్ బీఐ డైరెక్టర్ గా నియామకమైన కాష్‌కు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌లు అభినందనలు తెలిపారు.

కాష్ పటేల్1980 ఫిబ్రవరి 25న న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ లోని గుజరాత్‌కు చెందిన వారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మాండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫేస్ విశ్వవిద్యాలయంలో లా విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేస్తూ వివిధ కోర్టుల్లో జ్యూరీ విచారణలలో పలు కేసులను విచారించారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 2017లో, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ప్రత్యేక న్యాయవాదిగా నియామకమయ్యాడు. 2022లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో చేరారు. తాజా ఎన్నికల్లో ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశాడు. ఈ క్రమంలోనే ఎఫ్ బీఐ డైరెక్టర్ పదవి వరించింది.

Next Story