ఆర్సీబీ ఆటగాళ్ల సన్మాన సభ ప్లాన్ సర్కార్‌దే..! కర్ణాటక రాజ్‌భవన్ సంచలన ప్రకటన

by Ramesh Naini |

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ ప్రణాళిక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కర్ణాటక రాజ్ భవన్ తేల్చి చెప్పింది.

ఆర్సీబీ ఆటగాళ్ల సన్మాన సభ ప్లాన్ సర్కార్‌దే..! కర్ణాటక రాజ్‌భవన్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ ప్రణాళిక కర్ణాటక (karnataka Government) కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కర్ణాటక రాజ్‌భవన్ (Raj Bhavan) తేల్చి చెప్పింది. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో బయటపడుతున్న సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విధాన్‌ సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని సీఎం సిద్దరామయ్య ప్రకటించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను స్వయంగా ముఖ్యమంత్రే అధికారికంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తాజాగా రాజ్‌భవన్‌ ప్రకటించింది. మొదట ఆర్సీబీ ఆటగాళ్లను రాజ్‌భవన్‌లో సన్మానించాలని గవర్నర్ నిర్ణయించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అయితే సన్మాన సభ విధాన సౌధలో నిర్వహించాలని సిద్దరామయ్య సర్కార్ ప్లాన్ చేసిందని, గవర్నర్‌ను సీఎం స్వయంగా ఆహ్వానించారని రాజ్ భవన్ సిబ్బంది తెలిపారు.

ఈ ప్రకటనతో ఇటీవల ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిసిపోతుందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇక, రాజ్‌భవన్ వర్గాల వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తప్పుబట్టాయి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం గవర్నర్‌ను ఆహ్వానించిందని తేల్చి చెప్పారు. రాజ్‌భవన్ వర్గాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ సీఎం వ్యాఖ్యలకు విరుద్దంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. కాగా, 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్‌లో కప్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో విజయోత్సర్యాలీ, ఆటగాళ్లకు సన్మానం చేశారు. ఈ క్రమంలోనే స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ, ఈవెంట్ నిర్వహణ సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తమకు ఈ ఘటనతో సంబంధం లేదని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా బెంగళూరు పోలీస్ కమిషనర్‌తో సహా ఐదుగురు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్సీబీ, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారి వైద్య ఖర్చులను భరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Next Story