మారువేషంలో బస్సెక్కిన మంత్రి.. డ్రైవర్, కండక్టర్ సస్పెండ్

by Naga Rani Yarlagadda |

కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బైరతి సురేష్.. రాష్ట్ర బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 2 గంటల్లో 10కి పైగా బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించిన ఆయనకు అనేక సమస్యలు కనిపించాయి.

మారువేషంలో బస్సెక్కిన మంత్రి.. డ్రైవర్, కండక్టర్ సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బైరతి సురేష్.. రాష్ట్ర బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 2 గంటల్లో 10కి పైగా బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించిన ఆయనకు అనేక సమస్యలు కనిపించాయి. ఆకస్మిక తనిఖీ ఆయనకే చేదు అనుభవాలను ఎదురయ్యేలా చేసింది. శనివారం.. ముఖానికి మాస్క్ వేసుకుని సాధారణ ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించారు. ప్రతిరోజూ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. ప్రధానంగా ఫన్ వరల్డ్ బస్ స్టాప్ వద్ద ఓ ప్రయాణికుడు దిగేందుకు బస్సు ఆపాలని సంకేతమిచ్చినా.. డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్, కండక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక హెబ్బాళ్ - నాగశెట్టిహళ్లి రూటులో నడిచే మరో బస్సెక్కిన ఆయనకు చిల్లర సమస్య ఎదురైంది. రూ.100 ఇచ్చి టికెట్ ఇవ్వాలని అడగ్గా.. తన వద్ద తిరిగి ఇచ్చేందుకు చిల్లరలేదని, వెంటనే బస్సు దిగిపోవాలని సూచించాడు. అంతేకాకుండా నాగశెట్టిహళ్లిలో బస్సు దిగిన అనంతరం ఓ ఆటో డ్రైవర్ మీటర్‌లో రూ.30 చూపిస్తున్నప్పటికీ రూ.36 డిమాండ్ చేయడాన్ని గమనించిన మంత్రి.. అక్కడే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. ఈ తనిఖీల అనంతరం మంత్రి బైరతి సురేష్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా సేవలను మరింత మెరుగుపరచడం, ఉద్యోగుల్లో బాధ్యత పెంచడం, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడం లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలను బెంగళూరులో కొనసాగిస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story