Belagavi: మరోసారి తెరపైకి వచ్చిన ‘బెళగావి’ అంశం

by Shamantha N |

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఏళ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ‘బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మరోసారి చిచ్చు చెలరేగింది.

Belagavi: మరోసారి తెరపైకి వచ్చిన ‘బెళగావి’ అంశం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఏళ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ‘బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మరోసారి చిచ్చు చెలరేగింది. ఈ ఉద్రిక్తతల వేళ కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి సోమవారం బెళగావికి వచ్చారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) సిబ్బంది భద్రత, మహారాష్ట్రకు బస్సుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు, కన్నడ అనుకూల సంస్థ అయిన కర్ణాటక రక్షణ వేదిక (KRV) "బెళగావి చలో" నిరసనకు పిలుపునిచ్చింది. మంగళవారం కేఆర్వీ అధ్యక్షుడు నారాయణగౌడ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.

అసలు వివాదం ఏంటంటే?

మరాఠీలో సమాధానమివ్వలేదని బెళగావిలో కర్ణాటకకు చెందిన ఓ కండక్టర్‌ను చితకబాదారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. కండక్టర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓ బాలిక తనకు టికెట్‌ కావాలని మరాఠీలో అడిగింది. అయితే తనకు మరాఠీ రాదని, కన్నడలో చెప్పాలని కండక్టర్‌ చెప్పడంతో బాలిక, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి తనపై దాడి చేశారని కండక్టర్‌ తెలిపారు. ఈ క్రమంలో కొందరు బస్సును ఆపి, కండక్టర్‌పై దాడి చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ కేసులో సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కండక్టర్‌పై కూడా పోక్సో కేసు నమోదైంది. తనపై అనుచితంగా ప్రవర్తించారని బాలిక ఫిర్యాదు చేయడంతో కండెక్టర్ పై కేసు నమోదైంది. అయితే, ఈ ఘటనకు ప్రతీకార చర్యగా కర్ణాటకలోని చిత్ర దుర్గ జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కండక్టర్‌పై కొందరు దాడి చేసి నల్లరంగు పూశారు. ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలో కర్ణాటక బస్సుపై దాడి జరిగింది. బస్సుపై జై మహారాష్ట్ర, జై మరాఠీ, జై నవనిర్మాణ సేన అని నినాదాలు రాశారు. ఈ ఉద్రిక్తతల వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు, మహారాష్ట్రకు సర్వీసులను తగ్గిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, దీనిపై ఎప్పటికప్పుడు మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.

Next Story