Karnataka: రోడ్డుపై మహిళపై లైంగిక వేధింపులు.. హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-04-07 11:41:21  IST  )

లైంగిక వేధింపులపై కర్ణాటక హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

Karnataka: రోడ్డుపై మహిళపై లైంగిక వేధింపులు..  హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో (Bengaluru) రాత్రిపూట వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఓ వ్యక్తి వెంబడించి వారిని లైంగికంగా వేధించిన ఘటనపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర (Home Minister Parameshwara) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుంటే పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు జరగుతుంటాయని పరమేశ్వర కామెంట్స్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఇలాంటి పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బీట్ పెట్రోలింగ్ పెంచాలని పోలీసులకు తాను చూచించాను’ అని అన్నారు. బాధ్యతాయుతమైన హోంశాఖకు మంత్రిగా ఉండి మహిళల పట్ల లైంగిక దాడియత్నం జరిగితే ఆ దాడి తీవ్రతను తగ్గించేలా మాట్లాడటం ఏంటని మంత్రి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ నెల 3వ తేదీ అర్థరాత్రి వేళ బెంగళూరులోని బీటీఎం లే అవుట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీధిలో ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా వారి వద్దకు ఓ వ్యక్తి వచ్చి ఓ మహిళను అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురి చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైన సదరు మహిళలు ఆ అగంతకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘనటపై ఎలాంటి ఫిర్యాదు రాకపోయినా సీసీ టీపీ ఫుటేజ్ ఆధారంగా తామే స్వయంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Next Story