Karnataka: సీఎం మార్పు ఊహాగానాలకు బ్రేక్.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

by B.Srinivas |

కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగబోతుందనే ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Karnataka: సీఎం మార్పు ఊహాగానాలకు బ్రేక్.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగబోతుందనే ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Dk shiva kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం సిద్ధరామయ్యకు మద్దతిస్తానని, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు. బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘సిద్ధరామయ్యకు అండగా ఉండటం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను ఆయనకు మద్దతివ్వాలి. అందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పార్టీ అధిష్టానం ఏం చెప్పినా, ఏ డిసిషన్ తీసుకున్నా అది నెరవేరుతుంది’ అని వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించడానికి, ఎమ్మెల్యేల అభ్యర్థనలు స్వీకరించడానికి ఏఐసీసీ ప్రతినిధులు సమావేశమవుతున్నారని, కానీ సీఎం మార్పుపై ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.

తన మద్దతు దారులు సీఎం కావాలని ఒత్తిడి చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు శివకుమార్ స్పందిస్తూ.. దీనిపై ఏమీ చర్చించాలనుకోవడం లేదని తెలిపారు. లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారని కేవలం డీకేకు మాత్రమే కాదని చెప్పారు. అంతకుముందు సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఐదేళ్లు తానే పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే శివకుమార్ స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.

Next Story