RCB: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీయే కారణం: కర్ణాటక ప్రభుత్వ నివేదిక

by S Gopi |

ఆర్సీబీయే ప్రేక్షకులను స్టేడియం వద్దకు ఆహ్వానించిందని పేర్కొంది.

RCB: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీయే కారణం: కర్ణాటక ప్రభుత్వ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: గత నెల ఐపీఎల్ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చేసిన విజయోత్సవాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రపంచంలో విషాదం నింపింది. తాజాగా దీనికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు కీలక అంశాలను వెల్లడిస్తూ.. ఆర్సీబీయే ప్రేక్షకులను స్టేడియం వద్దకు ఆహ్వానించిందని, ఏకపక్షంగా, పోలీసుల నుంచి సరైన అనుమతులు లేకుండా పిలుపునిచ్చిందని పేర్కొంది. నివేదికను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది, కానీ అలాంటి గోప్యతకు ఎటువంటి చట్టపరమైన కారణాలు లేవని కోర్టు పేర్కొంది.

సరైన అనుమతి లేదు

నివేదిక ప్రకారం.. 18 సంవత్సరాల తర్వాత ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ జూన్ 3న పోలీసులను సంప్రదించి, విజయోత్సవ పరేడ్ గురించి తెలియజేసిందని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. అయితే, ఇది చట్ట ప్రకారం అవసరమైన అనుమతి కాకుండా సమాచారం మాత్రమే ఇచ్చారని నివేదిక స్పష్టం చేసింది. ఇటువంటి ఈవెంట్లకు కనీసం ఏడు రోజుల ముందు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్‌కు ఎంతమంది వస్తరు లాంటి సమాచారం లేకపోవడంతో అనుమతులు ఇవ్వలేదు. కానీ, ఆర్సీబీ గెలిచాక పోలీసులను సంప్రదించకుండా సోషల్ మీడియా ఎక్స్‌లో విక్టరీ పరేడ్ గురించి పోస్ట్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే వేడుకలకు ఉచితంగా ఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఆ తర్వాత విరాట్ కొహ్లీ కూడా ఈ విజయాన్ని బెంగళూరులో, ప్రజలు, అభిమానులతో జరుపుకోవాలని ఉందనే మరో వీడియో పోస్ట్ చేశారు. దీనివల్లే స్టేడియంలో పట్టే సామర్థ్యానికి మించి 3 లక్షల మంది వరకు వచ్చారు.

ఎంట్రీ పాస్ వ్యవహారం

ఆర్సీబీ యాజమాన్యం తీరుతో స్టేడియం వద్ద దాదాపు 14 కి.మీ మేర ప్రజలు గుమిగూడారు. అప్పటికీ స్టేడియంతో పాటు ఆ చుట్టుపక్కల పోలీసు సిబ్బందిని మోహరించాం. అంతమంది వచ్చిన తర్వాత ఎంట్రీ పాస్‌లు కావాలని నిర్వాహకులు కోరడంతో అభిమానులు గందరగోళానికి లోనయ్యారు. అదే సమయంలో నిర్వాహకులు ఈవెంట్ గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొన్ని గేట్ల వద్ద పోలీసులు అప్రమత్తమై ప్రజలను బలవంతంగా అడ్డుకోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని నివేదిక వెల్లడించింది.

Next Story