Karge:11 ఏళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు

by B.Srinivas |

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Karge:11 ఏళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ11 ఏళ్లు పూర్తి చేసుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అచ్చేదిన్ నినాదం పీడకలగా మారిందని ఆరోపించారు. దేశం నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఖర్గే సోమవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘2014 మే 26న బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో చేసిన భారీ వాగ్ధానాలకు శూన్య వాదనలుగా మార్చింది. అచ్చేదిన్ పీడకలగా మిగిలిపోయింది. ప్రస్తుతం 140 కోట్ల జనాభాలో ప్రతి వర్గం సమస్యల్లో ఉంది’ అని పేర్కొన్నారు. ‘ఏడాది రెండు కోట్ల ఉద్యోగాల హామీ కనుమరుగైంది. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. అంతేగాక వారు రబ్బరు బుల్లెట్ల దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు పెరిగాయి. మేక్ ఇన్ ఇండియా పూర్తిగా విఫలమైంది’ అని తెలిపారు.

విదేశాంగ విధానంలో విశ్వగురుగా మారతానని హామీ ఇచ్చారని, కానీ ప్రతి దేశంతో సంబంధాలను చెడగొట్టారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి చేసిందని ఫైర్ అయ్యారు. ఈడీ, సీబీఐ దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని, 11 ఏళ్లుగా దేశంలో ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సైతం మోడీపై విమర్శలు గుప్పించారు. కులగణన క్రెడిట్ తనదిగా చెప్పుకోవడం సరైంది కాదని తెలిపారు. కాంగ్రెస్ పోరాటం వల్లే అది సాధ్యమైందని వెల్లడించారు. కాగా, 2014 మే 26న మోడీ ప్రధాని మొదటి సారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దేశంలో ఎన్డీఏ పాలనే కొనసాగుతోంది.

Next Story