- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karge: రాజ్యసభలో ఖర్గేపై చైర్మన్ ధన్ ఖడ్ ఫైర్.. కారణమిదే?
మహా కుంభమేళా లో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మహా కుంభమేళా (Mahakumba mela)లో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపాయి. సోమవారం లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే సభ్యులు నినాదాలు చేశారు. మరణాల సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టిందని, మరణాలపై సరైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైనా సభ్యులు తమ స్లోగన్స్ కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్లా (Om Birla) వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మిమ్మల్ని టేబుల్ పగలగొట్టేందుకు పంపలేదని, చర్చకు సహకరించాలని సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాలని అడ్డంకులు సృష్టించొద్దని ఫైర్ అయ్యారు. అయినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు.
రాజ్యసభలో కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Malli karjun) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వేలాది మందికి నివాళులు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్క సారిగా గందరగోళం నెలకొంది. ఖర్గే వ్యాఖ్యలపై చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ (Jagadheep dhankad) ఫైర్ అయ్యారు. మృతుల సంఖ్యను మీ అంతట మీరే నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. ఈ తరహా కామెంట్స్ సరికాదని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఫైర్ అయ్యారు. అనంతరం ఖర్గే స్పందిస్తూ.. ఇవి నా అంచనా మాత్రమేనని, ఇది నిజం కాకపోతే ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరినీ నిందించడం లేదని కానీ ఎంత మంది మరణించారో సమాచారం ఇవ్వాలన్నారు. తప్పుగా మాట్లాడితే క్షమించాలని, కానీ ప్రభుత్వ లెక్కలు మాత్రం బయట పెట్టాలన్నారు.






