Kapil sibal: బీజేపీ ప్రజాస్వామ్య పునాదిని నాశనం చేసింది.. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్

by vinod kumar |
Kapil sibal: బీజేపీ ప్రజాస్వామ్య పునాదిని నాశనం చేసింది.. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. గత పదేళ్లలో పీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలన్నీ పూర్తిగా ప్రజలను విభజించేలా ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం ఆయన ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. ‘భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, గత పదేళ్లలో పీఎంఓ నుంచి వచ్చిన ప్రకటనలు విభజనను కలిగి ఉన్నాయి. ఈ దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇటువంటి ప్రకటనలు చేయలేదు. అంతేగాక ఆయన పార్టీకి చెందిన వారు సైతం ఇదే తరహా పద్దతిని అవలంభిస్తున్నారు. ఇప్పుడు అసోంలో సీఎం ‘లవ్‌ జిహాద్‌’, ‘వరద జిహాద్‌’ గురించి మాట్లాడుతున్నారు. కన్వరియాకు వెళ్లే టైంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం యజమానుల పేర్లు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేశారు’ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్య పునాదిని నాశనం చేసిందని మండిపడ్డారు. వారు చెబుతున్న మాటలు సరైనవి కావని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చ జరగాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ‘దీనిపై చర్చ జరగడం వల్ల ఎటువంటి నష్టం లేదు. కానీ విభజన ఎజెండాను ముందుకు తీసుకెళ్తే మాత్రం ఇది జరగబోదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని, కానీ ఇళ్ల నుంచి వెళ్లగొట్టబడిన హిందూ స్త్రీల పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ నుంచి ప్రవేశించాలనుకునే హిందువుల సంగతేంటి? రాజకీయ వ్యవస్థలోకి ప్రవేశించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నియంతృత్వ విధానాలను మానుకోవాలని సూచించారు.

Advertisement

Next Story