Kanwar Yatra: కన్వర్ యాత్రలో కఠిన ఆంక్షలు.. ఆ వస్తువులపై నిషేధం !

by B.Srinivas |

కన్వర్ యాత్రలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Kanwar Yatra: కన్వర్ యాత్రలో కఠిన ఆంక్షలు.. ఆ వస్తువులపై నిషేధం !
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్వర్ యాత్ర (Kanwar Yatra) లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ (Utharapradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రలో బేస్‌బాల్ బ్యాట్లు, హాకీ స్టిక్‌ సహా ఇతర వస్తువులను తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. గతంలో ఊరేగింపు మార్గంలో జరిగిన ఘర్షణల సమయంలో ఇటువంటి వస్తువులను దుర్వినియోగం చేయకుండా నియంత్రించడమే లక్ష్యంగా ఈ ఆంక్షలు విధించినట్టు అధికారులు తెలిపారు. యాత్ర మార్గంలోని మీరట్, ముజఫర్ నగర్, షామ్లి, సహరన్ పూర్, బులంద్ షహర్, హావూర్ వంటి జిల్లాల్లో ఈ బ్యాన్ వర్తించనుంది. ఈ రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కాగా, వారం రోజులుగా కన్వర్ యాత్ర మార్గాల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఇటీవల, మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో సిఆర్‌పిఎఫ్ జవానుపై దాడి చేసినందుకు ఏడుగురు కన్వారియాలను అరెస్టు చేశారు. సైనికుడిని తీవ్రంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్వర్ యాత్రికులకు మద్దతుగా నిలిచారు. కొంతమంది సోషల్ మీడియాలో కన్వర్ యాత్రను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Next Story