Kamal Haasan: కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కష్టాలు

by Shamantha N |

నటుడు, మక్కల్‌ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

Kamal Haasan: కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కష్టాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నటుడు, మక్కల్‌ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదం ఎఫెక్ట్ ఆయన రాజ్యసభ సీటు నామినేషన్ పై పడింది. భాషా వివాదం వేల ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్(Rajya Sabha nomination) దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. త్వరలో కమల్ థగ్ లైఫ్ సినిమా రిలీజ్ కానుంది. ఆ రిలీజ్ వ్యవహారం పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వివాదం ఏంటంటే?

కాగా.. ఇటీవల నిర్వహించిన ‘థగ్‌లైఫ్‌’ సినిమా ఈవెంట్‌లో తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్‌ చెప్పుకొచ్చారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కామెంట్లను వారు వ్యతిరేకించారు. దీంతో కర్ణాటకలో థగ్‌లైఫ్‌ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (KFCC) హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఆ పిటిషన్‌ను మంగళవారం విచారించిన న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. దీంతో ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్‌హాసన్‌ (Kamal Haasan) నిర్ణయించారు. అయితే, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ ‘కేఎఫ్‌సీసీ’కి కమల్‌ లేఖ రాశారు. కానీ, ఆ లేఖలోనూ ఆయన క్షమాపణలు చెప్పలేదు. ఇకపోతే, కమల్ హాసన్ 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా మారింది. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఎంఎన్ఎం మద్దతు ప్రకటించింది. దీంతో, 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్‌ఎంకు రాజ్యసభ స్థానం కేటాయించారు. దీంతో కమల్‌ హాసన్‌ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే-ఎంఎన్‌ఎం ఇటీవలే ప్రకటించింది.

Next Story