- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. ఆ పుస్తకంపైనే అందరి ఆసక్తి!
తమిళనాడు సీఎం విజయ్ ను.. MKM అధినేత కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కమల్ సీఎంకు ఇచ్చిన పుస్తకంపైనే అందరి దృష్టి పడింది.

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా లోకనాయకుడిగా పేరొందిన నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత అయిన కమల్ హాసన్ విజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కమల్ హాసన్.. విజయ్ తో భేటీ అవ్వడం చర్చనీయాంశమయింది. విజయ్ ను కలిసిన ఫొటోలను కమల్ హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తమిళనాడు సీఎం, సోదరుడు విజయ్ ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఆ పోస్ట్ కింద రాసుకొచ్చారు. తమిళనాడు అభ్యున్నతి కోసం ఆయన కంటున్న ఎన్నో కలలను ఈ సందర్భంగా తనతో పంచుకున్నారని, భేటీ అయిన సమయంలో విజయ్ చూపించిన వినయం, ఆప్యాయత తనను ఎంతో గర్వపడేలా చేశాయని కమల్ హాసన్ పోస్ట్ కింద పేర్కొన్నారు.
అలాగే.. వివిధ రకాల అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటున్న కోలీవుడ్ కు ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం ఎంతో అవసరమని కమల్ హాసన్ ఈ సందర్భంగా విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ.. ఆరు ముఖ్యమైన డిమాండ్లతో వినతిపత్రాన్ని సీఎం విజయ్ కు అందించినట్లు కూడా తెలిపారు. తాజా భేటీలో కమల్ హాసన్ సీఎం విజయ్‌కు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన 'గాంధీ బిఫోర్ ఇండియా' (Gandhi Before India) అనే పుస్తకాన్ని బహుమతిగా అందించడం విశేషం. గతంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో విలేకరులతో మాట్లాడుతూ.. విజయ్‌ను ఇకపై కేవలం ఒక నటుడిగా మాత్రమే చూడకూడదని హితవు పలికారు. "ఆయనకు ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ రంగం నుండైనా రావచ్చు. కానీ విజయ్ మన సినీ పరిశ్రమ నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది" అని కమల్ హాసన్ అప్పట్లోనే వ్యాఖ్యానించారు.






