Supreme court: కొత్త సీజేఐగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం

by S Gopi |

భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించే రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ గవాయ్ చరిత్ర సృష్టించారు.

Supreme court: కొత్త సీజేఐగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అత్యున్నత న్యాయస్థానం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గవాయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఏడాది నవంబర్ 23న ఆయ పదవీ కాలం ముగిసే వరకు బాధ్యతలు చేపట్టనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించే రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ గవాయ్ చరిత్ర సృష్టించారు. ఇదివరకు 2007లో దేశ అత్యున్నత న్యాయ పదవిని చేపట్టిన మొదటి దళితుడిగా కేజి బాలకృష్ణన్ నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జస్టిస్ గవాయ్‌కు అభినందనలు తెలిపారు.

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన బీఆర్ గవాయ్‌ది స్పూర్తిదాయకమైన జీవితం. మహారాష్ట్రలోని మురికివాడల నుంచి సుప్రీంకోర్టులో ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టారు. 1960, నవంబర్ 24న జన్మించిన జస్టిస్ గవాయ్, అమరావతిలోని ఫ్రేజర్‌పురా ప్రాంతంలో నివశించారు. ఆయన తల్లి కమల్‌తాయ్ గవాయ్ రిటైర్డ్ స్కూల్ టీచర్. ఆయన తండ్రి దివంగత రామకృష్ణ సూర్యభాన్ గవాయ్ అంబేద్కరైట్ సంస్థ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపకుడు. ఆయన అమరావతి నుంచి లోక్‌సభ ఎంపీగా చేశారు. 2006-2011 మధ్య బీహార్, సిక్కిం, కేరళ గవర్నర్‌గా కూడా పనిచేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ఒక మున్సిపల్ మరాఠీ-మీడియం పాఠశాలలో చదువుకున్నారు. అమరావతి యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన 1985లో 25 ఏళ్ల వయస్సులో ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాదిగా చేశారు. రెండు దశాబ్దాల పాటు సాగిన తన న్యాయ జీవితంలో, సీజేఐ గవాయ్ నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీ, ముంబైలలోని బెంచ్‌లలో పనిచేశారు.

ప్రధాన తీర్పులు

*సీజేఐ గవాయ్ వృత్తి జీవితంలో అనేక కీలక తీర్పులు వెలువరించారు. వాటిలో, రెండు దశాబ్దాలుగా సొంత ఇంటి యాజమాన్య హక్కు కోసం పోరాడుతున్న ఓ మహిళకు చట్టబద్ధంగా తన ఇంటిని తిరిగి పొందేందుకు ఆయన ఆదేశాలు దోహదపడ్డాయి.

*చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కి సంబంధించిన క్లిష్టమైన కేసులలో సీజేఐ గవాయ్ తీర్పులు కీలకంగా ఉన్నాయి.

*న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఆయన ధర్మాసనం ఉపశమనం కల్పించింది.

*గతేడాది నవంబర్‌లో, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం తగిన ప్రక్రియను పాటించకుండా పౌరుల ఆస్తులను కూల్చివేయడం చట్ట నియమాలను ఉల్లంఘించడమేనని తీర్పు ఇచ్చింది.

*షెడ్యూల్డ్ కులాల కోటా ఉప-వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. ఒక ప్రత్యేక సందర్భంలో కోటాను విభజించడానికి ఎస్సీ గ్రూపుల అభ్యంతరాన్ని 'అధిక కులాలు దళితులకు చేసిన' వివక్షతో పోల్చారు.

*2023లో, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను మంజూరు చేసిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడాన్ని సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు.

*గతేడాది ఆయన ధర్మాసనం ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసింది.

Next Story