CJI Gavai: 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం

by Prasad Jukanti |

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

CJI Gavai: 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత సర్వోన్నత న్యాయస్థానం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీజేఐ గా మంగళవారం రిటైర్ అయిన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈయన 23 నవంబర్ 2025న పదవీ విరమణ చేసే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా దేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన మొదటి బౌద్ధ సీజేఐ గా, జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తర్వాత రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ చరిత్ర పుటలకెక్కారు.

కీలక కేసుల్లో తీర్పులు:

24 నవంబర్ 1960 లో మహారాష్ట్రలోని అమరావతి లో జన్మించిన జస్టిస్ గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పని చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 700 ధర్మాసనాల్లో ఆయన భాగస్వామ్యం పంచుకున్నారు. నోట్ల రద్దు, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక కేసుల్లో తీర్పులు చెప్పారు.

అంబేద్కర్ తో గవాయ్ తండ్రికి అనుబంధం:

బీఆర్ గవాయ్ తండ్రి రామకృష్ణ సూర్యభన్ గవాయ్ 1998-99 మధ్య కాలంలో మహారాష్ట్రలోని అమరావతి నుంచి రిపబ్లికన్ పార్టీ (గవాయ్) తరఫున లోక్ సభసభ్యుడిగా, 2000-2006 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అలాగే బిహార్, సిక్కిం, కేరళ గవర్నర్ గా సేవలందించారు. ఆయనకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తో కలిసి పని చేశారు.

Next Story