JPC: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌.. జేపీసీకి మాజీ సీజేఐల కీలక సూచనలు

by B.Srinivas |

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం శుక్రవారం జరిగింది.

JPC: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌.. జేపీసీకి మాజీ సీజేఐల కీలక సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One nation one election) కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం శుక్రవారం జరిగింది. ఈ భేటీలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్‌లు జేపీసీ ఎదుట తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విధానం రాజ్యాంగానికి లోబడే జరుగుతున్నప్పటికీ అందులో అనేక లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉండబోదని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం ప్రాథమిక నిర్మాణంలో భాగమే అయినప్పటికీ, ఎన్నికలు విడివిడిగా నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వివరించినట్టు సమాచారం. ప్రతిపాదిత బిల్లు ద్వారా భారత ఎన్నికల సంఘం (ECI)కి ఇవ్వబడిన అపరిమిత అధికారాలకు సంబంధించి చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఎన్నికైన అసెంబ్లీల పదవీ కాలాన్ని తగ్గించడానికి ఈసీకి ఇవ్వబడిన అధికారం ఆమోదించలేదమని చెప్పినట్టు తెలిపాయి.

దేశవ్యాప్తంగా ఈ విధానానికి సానుకూల అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయని జేపీసీ చైర్‌పర్సన్ పీపీ చౌదరి తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్య అవసరమైన సవరణలు చేసిన తర్వాతే నివేదికను పార్లమెంటుకు పంపిస్తామని స్పష్టం చేశారు. జాతి నిర్మాణానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ఈ వ్యవస్థ ఎక్కువ కాలం కొనసాగాలంటే బిల్లు రాజ్యాంగబద్ధత చెక్కుచెదరకుండా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. కాగా, గతంలో మాజీ సీజేఐలు యూయూ లలిత్, రంజన్ గొగోయ్‌లు సైతం జేపీసీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు.

Next Story