Jp nadda: మోడీ పాలన సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

by B.Srinivas |

మోడీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రశంసించారు.

Jp nadda: మోడీ పాలన సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రశంసించారు. 2014 తర్వాత దేశ రాజకీయ సంస్కృతి పూర్తిగా మారిపోయిందని, అభివృద్ధే ధ్యేయంగా కొత్త రాజకీయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం సోమవారంతో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నడ్డా మీడియాతో మాట్లాడారు. 11 ఏళ్ల పాలన పారదర్శకమైన, భవిష్యత్ ఆధారిత వ్యవస్థగా రూపాంతరం చెందిందని తెలిపారు. దేశం కోసం ఎన్డీఏ అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని కొనియాడారు. ప్రభుత్వ చర్యల వల్ల భారత్‌లో తీవ్ర పేదరికం 80 శాతం తగ్గిందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సహా సమాజంలోని అన్ని వర్గాల కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమించిందని గుర్తు చేశారు. భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో స్థానానికి ఎగబాకిందని, ఇది త్వరలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నొక్కి చెప్పారు.

బీజేపీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ సవరణ, నోట్ల రద్దు, మహిళా కోటా బిల్లులు కీలకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించినప్పుడు కొన్ని పార్టీలు ప్రజలను రాజకీయ లబ్ధి పొందేలా రెచ్చగొట్టాయని ఆరోపించారు. కానీ దేశంలోని సామాన్యులు గంటల తరబడి క్యూలలో నిలబడి ఈ చర్యకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణం, బుజ్జగింపు రాజకీయాలతో నిండిపోయిందని విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు నిధులు మంజూరిపై ఎదుర్కొంటున్న ఆరోపణలపై నడ్డా స్పందిస్తూ.. రాజకీయ విభేదాల ఆధారంగా కేంద్రం ఎప్పుడూ నిధులను నిలిపివేయలేదని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేసిందని తెలిపారు.

మోడీ పాలన స్వర్ణయుగం: అమిత్ షా

11 ఏళ్ల మోడీ పాలన దేశానికి స్వర్ణయుగం లాంటిదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. ఈ టైంలో అనేక రంగాల్లో భారత్ పురోగతి సాధించిందని తెలిపారు. ఆర్థిక పునరుజ్జీవనం, సామాజిక న్యాయం, సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయ భద్రతలో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

Next Story