బైడెన్‌‌కు కేన్సర్.. త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రధాని మోడీ

by Phanindra |

అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌‌కు కేన్సర్ అని తేలింది. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

బైడెన్‌‌కు కేన్సర్.. త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు అడ్వాన్స్‌డ్ స్థాయి ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. కేన్సర్ ఆయన ఎముకలకు కూడా పాకిందనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలో యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, హిల్లరీ క్లింటన్ వంటి వారంతా బైడెన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా బైడెన్ అనారోగ్యంపై స్పందించారు. ‘జో బైడెన్ ఆరోగ్యం గురించి తెలిసి చాలా ఆందోళన చెందాను. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన భార్య డాక్టర్ జిల్ బైడెన్, ఇతర కుటుంబ సభ్యులకు మా సానుభూతి’ అని మోడీ పేర్కొన్నారు.

అయితే ఎముకల్లోకి కేన్సర్ చేరడం అనేది నాలుగో స్టేజ్‌లో మాత్రమే జరుగుతుందని, కేవలం నెలల వ్యవధిలో కేన్సర్ ఇంత తీవ్రతరం అవడం అసాధ్యమని కొందరు వైద్యులు చెప్తున్నారు. కేన్సర్ నాలుగో స్టేజ్‌కి చేరడానికి కనీసం 5-6 సంవత్సరాలు పడుతుందని, అంటే బైడెన్ పదవిలో ఉన్నంతకాలం కేన్సర్‌తోనే ఉన్నారని, అయినా సరే ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టిందని విమర్శకులు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కుమారుడైతే బైడెన్ భార్య జిల్ బైడెన్‌ను నిలదీశారు. ‘డాక్టరైన జిల్ బైడెన్‌కు భర్తలో ఇంతకాలం కేన్సర్ లక్షణాలే కనిపించలేదా?’ అని ప్రశ్నించారు. గత నవంబరు వరకు యూఎస్ అధ్యక్షుడిగా బైడెన్‌ ఉన్న సంగతి తెలిసిందే.

Next Story