Jhelum River: పీఓకేకు వరద ముప్పు.. భారత్ పనేనని పాక్ ఆరోపణ !

by B.Srinivas |

భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.

Jhelum River: పీఓకేకు వరద ముప్పు.. భారత్ పనేనని పాక్ ఆరోపణ !
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాకిస్థాన్ (India pakisthan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. జీలం నది నీటి మట్టం ఆకస్మికంగా పెరిగింది. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ముజఫరాబాద్‌కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో హట్టియన్ బాలా ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. స్థానిక పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. చకోఠి సరిహద్దు నుంచి ముజఫరాబాద్ వరకు జీలం నది ఒడ్డున నివసించే ప్రజలు నీటి మట్టం గణనీయంగా పెరగడంతో వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని, ఉద్దేశ పూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తోంది. భారత్ తమ వ్యూహంలో భాగంగానే నీటిని రిలీజ్ చేసిందని అనుమానం వ్యక్తం చేసింది. భారత్‌లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి ప్రవేశిస్తున్నట్టు సమాచారం. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సింధూ ఒప్పందాన్ని నిలిపివేస్తామని భారత్ నిర్ణయిం తీసుకున్న తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Next Story