Japan: ఆయిల్ రిజర్వ్‌లను విడుదల చేస్తామని ప్రకటించిన జపాన్

by S Gopi |

మార్చి 16 నాటికి జపాన్ తన ఆయిల్ రిజర్వ్‌లలో కొంత భాగాన్ని విడుదల చేస్తుందని ప్రధాన మంత్రి సనాయె టకాయిచి బుధవారం తెలిపారు.

Japan: ఆయిల్ రిజర్వ్‌లను విడుదల చేస్తామని ప్రకటించిన జపాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో జపాన్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి తమ వద్ద ఉన్న చమురు నిల్వల్లో కొంత భాగం మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. మార్చి 16 నాటికి జపాన్ తన ఆయిల్ రిజర్వ్‌లలో కొంత భాగాన్ని విడుదల చేస్తుందని ప్రధాన మంత్రి సనాయె టకాయిచి బుధవారం తెలిపారు. సరఫరా సమస్యలను తగ్గించడానికి జపాన్ 15 రోజుల విలువైన ప్రైవేట్ రంగ చమురు నిల్వలను, నెల రోజులకు చెందిన ప్రభుత్వ చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించిందని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాల్లోని చమురు నిల్వలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్లోబల్ మార్కెట్లలో ఇంధన కొరత తగ్గుతుందని, ధరలు స్థిరంగా కొనసాగేందుకు దోహదపడుతుందన్నారు. సరఫరా కొరతను నివారించడానికి, చమురు ధరలలో అస్థిరతను అరికట్టడానికి కావాల్సిన అత్యవసర చర్యలపై జీ7 దేశాల ఆర్థిక మంత్రులు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో చర్చల తర్వాత జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే, చమురు నిల్వలను విడుదల చేయడం ద్వారా ప్రపంచ చమురు సరఫరాకు మద్దతిచ్చే చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) జీ7 దేశాలకు సూచించింది.

Next Story