నటి వాడిన బ్యాగు ధర రూ.85 కోట్లు.. పిచ్చికి పరాకాష్ట ఇది

by Naga Rani Yarlagadda |

బ్రిటన్‌కి చెందిన ప్రఖ్యాత నటి, గాయని జానే బర్కిన్‌ కోసం ఫ్రెంచ్‌ లగ్జరీ బ్రాండ్‌ హర్మెస్‌ రూపొందించిన ఓ అరుదైన హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు చరిత్ర సృష్టించింది.

నటి వాడిన బ్యాగు ధర రూ.85 కోట్లు.. పిచ్చికి పరాకాష్ట ఇది
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌కి చెందిన ప్రఖ్యాత నటి, గాయని జానే బర్కిన్‌ కోసం ఫ్రెంచ్‌ లగ్జరీ బ్రాండ్‌ హర్మెస్‌ రూపొందించిన ఓ అరుదైన హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు చరిత్ర సృష్టించింది. ప్యారిస్‌లో జరిగిన సోథిబే వేలంలో ఈ ఒరిజినల్‌ బర్కిన్‌ బ్యాగ్‌ ఏకంగా €8.58 మిలియన్‌ (దాదాపు ₹85 కోట్లు) ధరకు విక్రయమైంది. ఈ ధర ఓ హ్యాండ్‌బ్యాగ్‌కు ఇప్పటివరకు పలికిన అత్యధికమైనదిగా చరిత్రలో నిలిచింది. ఈ బ్యాగ్‌ను జపాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ కలెక్టర్ కొనుగోలు చేశారని సోథిబే పేర్కొంది. కానీ వ్యక్తిగత గోప్యతా కారణాల వల్ల అతని వివరాలు బయటపెట్టలేదు.

బర్కిన్‌ బ్యాగ్‌ పుట్టుక వెనక కథ

1980లలో జానే బర్కిన్‌ లండన్‌ ప్రయాణానికి విమానంలో వెళ్తుండగా, ఆమె పక్కన హర్మెస్‌ అధినేత జీన్ లూయిస్‌ డ్యూమస్‌ కూర్చుని ఉన్నారు. విమాన ప్రయాణంలో మాట్లాడుతుండగా, తాను తల్లిగా ఉపయోగించేందుకు సరైన, విశాలమైన స్టైలిష్‌ బ్యాగ్‌ దొరకడం లేదని జానే చెప్పారు. అందుకే 1984లో హర్మెస్‌ సంస్థ ఆమె అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బ్యాగ్‌ రూపొందించి "బర్కిన్‌" అనే పేరు పెట్టింది. ఈ బ్యాగ్‌ మొదట్లో జానే బర్కిన్‌ స్వయంగా వినియోగించేవారు. బ్యాగ్‌పై ఆమె ప్రారంభ అక్షరాలు “J.B.” ప్రత్యేకంగా చేయించారు. లోపల ప్రత్యేకమైన లోహ రింగులు, స్ట్రాప్‌లు ఉండేలా రూపొందించారు. అయితే కొంతకాలం తర్వాత జానే ఆ బ్యాగ్‌ను హర్మెస్‌కు తిరిగి ఇచ్చారు. 1994లో వేలం వేసి వచ్చిన మొత్తాన్ని ఎయిడ్స్‌ మద్దతు చారిటీకి విరాళంగా ఇచ్చారు.

25 ఏళ్ల తర్వాత మరోసారి వేలం

ఆ తరువాత ప్యారిస్‌కు చెందిన కేథరిన్‌ బెనియర్‌ అనే మహిళ బ్యాగ్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు, దాదాపు 25 ఏళ్ల తర్వాత సోథిబే సంస్థ మళ్లీ ఈ బ్యాగ్‌ను వేలానికి పెట్టగా, అంతకుముందు నమోదు కాని రికార్డు ధర పలికింది. ఈ ఒరిజినల్‌ బ్యాగ్‌కు వచ్చిన ఆదరణతో.. హర్మెస్‌ సంస్థ చిన్న పరిమాణంలో, అదే డిజైన్‌తో లిమిటెడ్ ఎడిషన్ బ్యాగులు తయారు చేస్తోంది. హాలీవుడ్‌ సెలబ్రిటీలు జెన్నిఫర్‌ లోపెజ్‌, విక్టోరియా బెక్‌హమ్‌ వంటి ప్రముఖులు వీటిని వాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీటి ప్రారంభ ధర $10,000 నుంచి ప్రారంభమవుతుంది. జానే బర్కిన్‌ 2023లో కన్నుమూశారు. కానీ ఆమె పేరుతో ప్రారంభమైన బ్యాగ్‌ ఇప్పటికీ లగ్జరీ ఫ్యాషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఉత్పత్తిగా నిలుస్తోంది.

Next Story