అణచివేస్తే జీహాద్ జరుగుతుంది.. జమియత్ ఉలేమా ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్

by Phanindra |   (  Updated:2025-11-29 17:48:42  IST  )

అణచివేస్తే జీహాద్ జరుగుతుందని జమియత్ ఉలేమా-ఎ-హింద్ ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జీహాద్ ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుందన్నారు.

అణచివేస్తే జీహాద్ జరుగుతుంది.. జమియత్ ఉలేమా ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: మైనార్టీలపై అణచివేత జరిగితే జీహాద్ జరుగుతుందని జమియత్ ఉలేమా-ఎ-హింద్ ప్రెసిడెంట్ మహమూద్ మదానీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ క్రమంలో దేశ ప్రభుత్వం, జ్యుడీషియరీ వ్యవస్థ మైనార్టీ హక్కులను తక్కువ చేస్తోందని ఆయన విమర్శించారు. బాబ్రీ మసీదు, ట్రిపిల్ తలాక్ వంటి తీర్పులు చూస్తే న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ఒత్తిడి ఉందనిపిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో ఇలా మైనార్టీ హక్కులను తక్కువచేసే చాలా తీర్పులు వచ్చాయని, రాజ్యాంగం మైనార్టీలకు అందించిన హక్కులను ఇలాంటి తీర్పులు బహిరంగంగానే తక్కువ చేస్తున్నాయని మదానీ ఆరోపించారు.

ప్లేసెస్ ఆఫ్ వర్‌షిప్పింగ్ చట్టం ఉన్నప్పటికీ కేసుల విచారణ జరగడాన్ని కూడా తప్పుపట్టిన ఆయన.. ‘రాజ్యాంగాన్ని కాపాడుతున్నంతసేపు మాత్రమే సుప్రీంకోర్టు సుప్రీంగా ఉంటుంది. అలా జరగనప్పుడు అది సుప్రీంకాదు’ అన్నారు. సమాజంలో జీహాద్‌ను వక్రీకరిస్తున్నారని కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ప్రభుత్వం, మీడియా కలిసి ఈ పవిత్ర విధానాన్ని వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. లవ్ జీహాద్, స్పిట్ జీహాద్, ల్యాండ్ జీహాద్ వంటి పదాలను వాడటాన్ని తప్పుబట్టారు. జీహాద్ ఎప్పటికీ పవిత్రమైనదేనని ప్రకటించారు. ఇతరుల మంచి కోసమే జీహాద్ జరుగుతుందని, అణిచివేయాలని చూస్తే జీహాద్ జరగక తప్పదని హెచ్చరించారు.

అయితే భారత్‌లోని సెక్యులర్, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి హింసాత్మక వివరణను అంగీకరించదని, ముస్లింలు రాజ్యాంగం పట్ల విధేయులై ఉంటారని చెప్పారు. అలాగే వందేమాతరం పాడటాన్ని కూడా విమర్శించిన ఆయన.. కేవలం చావ లేని సామాజిక వర్డమే లొంగిపోతుందని, వందేమాతరం పాడమని అడగ్గానే పాడేది అలాంటి వారేనని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న వేళ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బీజేపీ ఫైర్

మదానీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ మండిపడ్డారు. ముస్లింలను రెచ్చగొట్టేందుకు ఆయన ప్రయత్నించారని, రాజ్యాంగబద్ధ సంస్థలను సవాల్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో కొత్త జిన్నాలు పుట్టుకొచ్చి, ఈ దేశంలోని ముస్లింలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మదానీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదానీ ఈ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, సుప్రీంకోర్టును సవాల్ చేశారని మండిపడ్డ రామేశ్వర్ శర్మ.. ఎవరి హద్దుల్లో వాళ్లుంటే మంచిదని హెచ్చరించారు.

మదానీ వంటి వ్యక్తులే ఉగ్రవాదులు, జీహాదీలు, రేపిస్టులను తయారు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వాళ్లు లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్, థూక్ (స్పిట్) జీహాద్ వంటి వాటిని ప్రోత్సహించి, సుప్రీంకోర్టులో మాత్రం బిర్యానీ వడ్డించాలని ఆశిస్తారంటూ మదానీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసి, అమాయకులను చంపితే సుప్రీంకోర్టు బహుమానాలు ఇవ్వాలా? అలాంటి వాళ్లకు సుప్రీంకోర్టు ఉరేస్తుంది అని వార్నింగ్ ఇచ్చేరాు. మదానీ తన తప్పుడు ప్రవర్తనను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

Next Story