Jamiat: ముస్లింల మనోభావాలను గౌరవించాలి.. జమియత్ చీఫ్ అర్షద్ మదానీ

by vinod kumar |
Jamiat: ముస్లింల మనోభావాలను గౌరవించాలి.. జమియత్ చీఫ్ అర్షద్ మదానీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లు(Waqf bill)కు సంబంధించి జమియత్-ఉలేమా-ఏ-హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ (moulana Arshad madhani) కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandra babu nayudu), జనతాదళ్ యునైటెడ్ (Jdu) చీఫ్ నితీశ్ కుమార్‌ (Nithish kumar)లు ముస్లింల మనోభావాలను పట్టించుకోవాలని కోరారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే రెండు పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం(Indore Stadium)లో ఆదివారం నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్ కన్వెన్షన్’లో ఆయన ప్రసంగించారు. బీజేపీ విధానాలు నచ్చకే దేశ ప్రజలు వారిని తిరస్కరించారని, టీడీపీ, జేడీయూల అండదండలు లేకుంటే దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదన్నారు. ముస్లింల భావోద్వేగాలను విస్మరించి వక్ఫ్ బిల్లును ఆమోదించినట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి ఎంత బాధ్యత ఉంటుందో, వారికి అండగా నిలిచే వారికి సైతం అంతే బాధ్యత ఉంటుందని తెలిపారు.

ముస్లింలు ఈ దేశంలోనే నివసిస్తున్నారని, బయట నుంచి రాలేదని గుర్తు చేశారు. కాబట్టి వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో చాలా మసీదులు ఉన్నాయని, వాటిలో కొన్ని 400 నుంచి 500 ఏళ్ల నాటివని గుర్తు చేశారు. దేశంలోని ఒక వర్గం ఈ మసీదులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 500 ఏళ్ల నాటి పత్రాలను ఎవరు అందజేయగలరని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే మైనారిటీలందరూ తమ మతాన్ని ఆచరించడానికి స్వేచ్ఛగా ఉంటారని లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి (India alliance) ప్రకటించిందని, అందుకే ముస్లింలంతా వారికి మద్దతుగా నిలిచారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed