- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ సంస్థ సంచలన రిపోర్ట్.. కావాలనే చేశారా?
గతేడాది జూన్ లో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఇటలీకి చెందిన సంస్థ సంచలన నివేదిక విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: 2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా (Ahmedabad Air India Crash) విమానం కూలిపోయిన ఘటనపై విచారణ తుది దశకు చేరుకుంది. ఈ ఘోర ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించింది కాదని, ఇది ఒక "ఉద్దేశపూర్వక చర్య" (Intentional Act) అని దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఇటలీకి చెందిన ప్రముఖ పత్రిక 'కొరియర్ డెల్లా సెరా' (Corriere della Sera) వెల్లడించింది. న్యూఢిల్లీ మరియు వాషింగ్టన్ అధికారుల మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ఈ వివరాలను ప్రచురించింది.
కాక్‌పిట్ లోని ఆఖరి సంభాషణ
దర్యాప్తులో భాగంగా విమాన బ్లాక్ బాక్స్ మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలించగా కీలక విషయాలు బయటపడ్డాయి. విమానం గాలిలోకి ఎగిరిన కొద్ది సెకన్లకే ఇంధన సరఫరా (Fuel Supply) నిలిచిపోయినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఒక పైలట్ "ఇంధన సరఫరాను ఎందుకు ఆపివేశావు?" అని అడగ్గా, రెండో పైలట్ "నేను చేయలేదు" అని సమాధానమిచ్చినట్లు రికార్డింగ్‌లో స్పష్టమైంది. ఇంజిన్‌కు ఇంధనాన్ని నియంత్రించే స్విచ్‌లను ఎవరో మేన్యువల్‌గా ఆఫ్ చేయడం వల్లే విమానం శక్తిని కోల్పోయి నేలకూలిందని దర్యాప్తు బృందం భావిస్తోంది.
ప్రధాన అనుమానితుడిగా కెప్టెన్
ఈ విమానాన్ని కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ నడుపుతున్నారు. ఇటలీ పత్రిక కథనం ప్రకారం.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కొన్ని నెలల ముందు నుంచి ఆయన తీవ్రమైన మానసిక కుంగుబాటు (Depression) తో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే.. సుమీత్ తండ్రి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తన కుమారుడికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
260 మంది మృతి.. ఒక్కరే ప్రాణాలతో..
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులతో పాటు హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు కలిపి మొత్తం 260 మంది మరణించారు. కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. భారత విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) అధికారిక నివేదిక వెలువడితేనే ఈ ఘోర ప్రమాదానికి గల పూర్తి కారణాలు స్పష్టమవుతాయి.






