- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్-పాక్ సమస్య కాదు.. ప్రపంచ సమస్య.. యూరప్ దేశాలకు జైశంకర్ సలహా!
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జరిగింది కేవలం భారత్-పాక్ సమస్య కాదని, ప్రపంచ సమస్య అని యూరప్ దేశాలకు జైశంకర్ స్పష్టంచేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ మధ్య ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలు.. ఇరుగుపొరుగు దేశాల మధ్య జరిగిన గొడవ కాదని, ఉగ్రవాదంపై పోరు అని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న ఆయన.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పహెల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించారు. ఈ క్రమంలో ఒసామా బిన్‌లాడెన్‌ను కూడా గుర్తుచేశారు. ‘బిన్ లాడెన్ వంటి వ్యక్తి పాకిస్తాన్‌లో ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు? అది కూడా ఒక మిలటరీ టౌన్‌లో?’ అని జైశంకర్ ప్రశ్నించారు. ఇది కేవలం భారత్-పాకిస్తాన్ సమస్య కాదని, ఉగ్రవాదంపై యుద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ఈ ఉగ్రవాదం ఎప్పుడో ఒకసారి యూరప్‌పై పంజా విసురుతుందని హెచ్చరించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తీరుపై ప్రశ్నలకు కూడా స్పష్టంగా బదులిచ్చారు. ఈ విషయంలో తాము ఒకరికి మద్దతు ఇవ్వడం లేదని, తమకు ఉక్రెయిన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. అక్కడితో ఆగకుండా భారత్‌పై పశ్చిమ దేశాల తీరును ఎండగట్టారు. ‘మాకు స్వాతంత్ర్యం వచ్చి ఏడాది కూడా గడవక ముందే సరిహద్దుల్లో దాడి జరిగింది. ఈ దాడికి పూర్తిగా మద్దతిచ్చింది పశ్చిమ దేశాలే. ఇలాంటి దేశాలు అంతర్జాతీయ నిబంధనలు నిర్ణయించడం ఏంటి?’ అని నిలదీశారు. అలాగే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం) బిల్లును భారత్ వ్యతిరేకించడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. ‘మేం ఈ బిల్లులోని కొన్ని విషయాలను వ్యతిరేకిస్తున్నాం. ఇందులో దాచుకోవడానికేం లేదు. కొన్ని దేశాలు కలిసి ప్రపంచం అంతా ఎలా ఉండాలని నిర్ణయించడాన్ని మేం ఒప్పుకోం’ అని స్పష్టంచేశారు.
చైనా విషయంలో యూరప్ దేశాల తీరును కూడా ప్రస్తావించిన ఆయన.. ‘చైనాకు చెందిన సప్లై చైన్ల విషయంలో యూరప్ దేశాల్లో ఆందోళన పెరుగుతోంది. తమ డేటాను ఎక్కడ దాచాలో అని కూడా వాళ్లు ఆలోచిస్తున్నారు. చైనాలో కాకుండా ఎక్కడైనా నమ్మకమైన దేశంలో దీన్ని ఉంచాలని అనుకుంటున్నారు’ అని వివరించారు. అదే సమయంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్.. తక్కువ ఖర్చయ్యే శ్రామిక శక్తిని అందిస్తుందని, అదే సమయంలో చైనా కన్నా మంచి ఆర్థిక భాగస్వామి అని గుర్తుచేశారు.






