మన సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదు.. లోక్‌సభలో విపక్షాలకు రాజ్‌నాథ్ క్లాస్

by Kema Shiva Kumar |

పహల్గాంలో ఉగ్రదాడి అత్యంత హేయమైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

మన సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదు.. లోక్‌సభలో విపక్షాలకు రాజ్‌నాథ్ క్లాస్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాంలో ఉగ్రదాడి అత్యంత హేయమైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’ చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంగా చేపట్టిన సైన్యానికి అభినందనలు తెలిపారు. పహల్గాం టెర్రర్ అటాక్‌కు బదులుగా తాము ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని తెలిపారు. దేశ ప్రజలను రక్షించడమే తమ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మతం పేరును అడిగి మరీ పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఆపరేషన్ సిందూర్‌కు ముందు సైనికులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

అందుకే ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టాం..

పాకిస్థాన్ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా దాడులు చేశామని రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో తెలిపారు. మే 7న రాత్ర భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చూపాయని తెలిపారు. పీవోకే, పాక్ ఉగ్రవాత స్థావరాలపై దాడులు జరిపామని అన్నారు. మన సైనికులు మొత్తం ఏడు ఉగ్ర శిబిరాలను ధ్వసం చేశారని.. ఆ దాడుల్లో 100కుపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం 22 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశామని తెలిపారు. సిందూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని.. అందుకే ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టామని సభకు వివరించారు. ఆపరేషన్ సిందూర్ తరువాతే పాక్ సైన్యం మనపై దాడికి దిగిందని పేర్కొన్నారు. అయినా.. వారి దాడులను సమర్ధవతంగా తిప్పికొట్టామని, మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు.

పాక్ కాళ్లబేరానికి వచ్చింది..

ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్‌లోని మిసైల్ లాంఛింగ్ స్టేషన్ ధ్వసమైందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాయాది దాడులను మన రక్షణ వ్యవస్థ పక్కాగా అడ్డుకుందని తెలిపారు. భారత వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని, మన త్రివిధ దళాలు కలిసి పాక్‌ను చిత్తు చేశాయని పేర్కొన్నారు. సరిహద్దులు దాటి వెళ్లడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదని.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. త్రివిధ దళాల దాడి తట్టుకోలేక పాక్ డీజీఎంలో మనకు ఫోన్ చేసి కాళ్ల బేరానికి వచ్చారని గుర్తు చేశారు. మాతృ భూమి రక్షణలో మన సైనికుల వీరత్వం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. భుజ్, ఉధంపూర్ స్థావరాలకు స్వయంగా వెళ్లి మన సైనికుల సత్తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కానీ, మన సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదని విపక్షాలకు క్లాస్ పీకారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదని హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందనే విషయాన్ని గట్టిగా చెబుతున్నామని అన్నారు. తాను గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. విపక్షాల నుంచి ఇలాంటి ప్రశ్నలు తానెప్పుడూ వినలేదని కామెంట్ చేశారు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి, ఆలోచించి ప్రశ్నలు అడగాలని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.

స్నేహాన్ని చాటడం మన దేశ గొప్పదనం..

1962లో చైనాతో యుద్ధం జరిగిన నాడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నలు వేశారని.. విపక్షంలో ఉన్న వాజ్‌పేయి కూడా మన ఆర్మీ సత్తాను ప్రశంసించారని గుర్తు చేశారు. 1999లో శాంతియుత పరిస్థితి కోరుతూ.. వాజ్‌పేయి లాహోర్ యాత్రను చెపట్టారని పేర్కొన్నారు. పాక్‌తో స్నేహం కోరుకుంటుందని ఆనాడు వాజ్‌పేయి కోరుకున్నారని.. స్నేహాన్ని చాటడం మన దేశం గొప్పదనమని అన్నారు. కానీ, ఆనాడు ఆయన తలుచుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదని రాజ్‌నాథ్ సింగ్ కామెంట్ చేశారు.

Next Story