ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ.. పిటిషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ ఆవేదన

by Naga Rani Yarlagadda |

రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ కు వరుస షాకులు తగుతులున్నాయి.

ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ.. పిటిషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ కు వరుస షాకులు తగుతులున్నాయి. ఆమె నామినేషన్ ను ఈసీ తిరస్కరించగా.. దానిపై విచారణ కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. సదరు పిటిషన్ విచారణకు అర్హత లేదని తేల్చేసింది. దీంతో మీనాక్షి నటరాజన్.. ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బ అని వాపోయారు. తన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. పిటిషన్ ను రిజెక్ట్ చేయడం కేవలం తన వ్యక్తిగత ఓటమి మాత్రమే కాదని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే పెద్ద దెబ్బ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘంలో ఉన్న అధికారులు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడులకు లొంగిపోయారని తాను మొదటి నుంచీ చెప్తూనే ఉన్నానన్నారు. నామినేషన్ ను రిజెక్ట్ చేయడంపై తమ పార్టీ ప్రతినిధులు ఈసీని సంప్రదిస్తే 48 గంటలపాటు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని వాపోయారు. ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె.. సుప్రీంకోర్టు తీర్పుపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్నారు. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయం ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైందని పేర్కొన్నారు. కాగా.. ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరికి నిరసనగా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ఎత్తున 'సత్యాగ్రహ' నిరసన చేపట్టాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఈసీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story