- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు గుడ్‌బై..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ పిలుపునిచ్చారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో టీపీసీబీ అధికారులతో కలిసి వ్యాపారులు, హోటల్ యజమానులు, షాపు యజమానులకు ప్లాస్టిక్ నిషేధం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2026 పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భూగర్భ జలాలు కలుషితమవడంతో పాటు జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనల మేరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ కప్పులు, స్ట్రాలు, ప్లేట్లు వినియోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
బట్ట సంచుల వినియోగం తప్పనిసరి
వ్యాపారులు, వినియోగదారులు తమ వద్ద ఎప్పుడూ బట్ట సంచులు, జనపనార సంచులు, కాగితపు కవర్లు ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సంగారెడ్డి ని సాధించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
సాలిడ్, వేస్ట్ వేరు చేయడం తప్పనిసరి
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2026 నిబంధనల ప్రకారం ప్రతి ఇల్లు, షాపు, హోటల్‌లో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కమిషనర్ విజయకుమార్ వివరించారు. తడి చెత్త నుండి కంపోస్ట్ తయారీ, పొడి చెత్త రీసైక్లింగ్ ద్వారా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచవచ్చని అన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వ్యాపారుల సహకారం కోరిన టీపీసీబీ
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారిణి విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని వ్యాపారులను కోరారు. మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ అమ్మకాలను అరికడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






