అమెరికాను తక్షణమే వీడటం ఉత్తమం.. మరోసారి విదేశీయులకు అక్కడి ప్రభుత్వం హెచ్చరిక

by Yella Dhawani Reddy |

అమెరికాలో (America) అక్రమంగా నివసిస్తున్న వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

అమెరికాను తక్షణమే వీడటం ఉత్తమం.. మరోసారి విదేశీయులకు అక్కడి ప్రభుత్వం హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) అక్రమంగా నివసిస్తున్న వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తమ దేశంలో ఎక్కువకాలం నివసించే విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద రిజిస్టర్‌ చేయించుకోవాలని పేర్కొంది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించింది.

అంతేకాదు, తక్షణమే స్వతహాగా దేశం విడిచిపెట్టి వెళ్లటం ఉత్తమమని సూచించింది. ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని, సామాను సర్దుకుని విమానం ఎక్కాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారిలో విమాన టికెట్ సొమ్మును భరించలేని వారు ఉంటే.. వారికి టికెట్ సొమ్ములో రాయితీ ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

అలాగే, 30 రోజులకు మించి అమెరికాలో ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇక ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్ల (దాదాపు రూ.86 వేలు) జరిమానా, సొంతంగా వెళ్ళిపోకపోతే 1,000 నుంచి 5,000 డాలర్ల (గరిష్ఠంగా రూ.4.30 లక్షలు) వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. అంతేకాదు, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. భవిష్యత్తులో మళ్లీ అమెరికాలో ప్రవేశించే అవకాశాన్ని కూడా కోల్పోతారని స్పష్టం చేసింది.

అయితే, ఈ నిర్ణయం నేరుగా H1B, విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు. ఎవరైనా హెచ్‌1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే.. వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థి, హెచ్‌1బీ వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

Next Story