ఇస్రో 101వ మిషన్ ఫెయిల్.. కారణం తెలుసుకునేందుకు కమిటీ: ఇస్రో చైర్మన్

by Phanindra |

ఇస్రో 101వ మిషన్ ఫెయిలైందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. దీనికి కారణం తెలుసుకునేందుకు కమిటీ వేసినట్లు చెప్పారు.

ఇస్రో 101వ మిషన్ ఫెయిల్.. కారణం తెలుసుకునేందుకు కమిటీ: ఇస్రో చైర్మన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థం (ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ విఫలమైంది. ఆదివారం ఉదయం 5.59 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈవోఎస్-09 శాటిలైట్‌ను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ బయలుదేరింది. అయితే కొన్ని నిమిషాలకే ఈ రాకెట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, దీంతో మిషన్ ఫెయిలైందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు.

ఈ రాకెట్ వైఫల్యంపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. రాకెట్ లాంచ్ తర్వాత మూడో దశలో మోటార్ కేస్‌లో ఉండాల్సినంత ఒత్తిడి లేకపోవడంతో ఈ మిషన్ ముందుకుసాగదని తమకు అర్థమైనట్లు నారాయణన్ చెప్పారు. ‘ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసుకునేందకు కమిటీని వేశాం. ఈ సమస్య కారణం తెలియగానే దాన్ని వెల్లడిస్తాం’ అని ఆయన తెలియజేశారు. ఈ మిషన్ ఫెయిలవడం చాలా బాధకరమన్న ఆయన.. మిగతా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టంచేశారు. ఈ ఏడాది ప్రతి నెలా ఒక మిషన్ ఉండేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు.

అంతకుముందు, ‘ఇస్రో చేసిన 101వ రాకెట్‌ లాంచ్ విఫలమైంది. రెండో దశ వరకు రాకెట్ అనుకున్నట్లుగానే ప్రయాణించింది. కానీ మూడో దశలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్‌ను పూర్తిచెయ్యలేకపోయాం’ అని ఆయన వెల్లడించారు.

ఇస్రో ఇప్పటి వరకు పంపిన 100 రాకెట్లలో 62 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే. ఇప్పుడు పీఎస్‌ఎల్‌‌వీ 63వ ప్రయోగం విఫలమవడం పట్ల పలువురు శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు కేవలం రెండుసార్లు విఫలమయ్యాయి. మొదటిసారి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగించినప్పుడు 1993లో ఇది విఫలమైంది. ఆ తర్వాత 2017లో సీ-39 మిషన్ సమయంలో ఈ రాకెట్ ఫెయిలైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ విఫలమైంది.

Next Story