Israel: ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు

by Shamantha N |

ఇజ్రాయిల్ ఇరాన్ పై భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 224 మంది చనిపోయారని 1200 మందికి పైనే గాయపడ్డారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.

Israel: ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు
X

దిశ,నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్ ఇరాన్ పై భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 224 మంది చనిపోయారని 1200 మందికి పైనే గాయపడ్డారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ లోని అణ్వస్త్ర క్షేత్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ ఆదివారం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ కూడా వందల మిస్సైళ్లతో ఇజ్రాయిల్ పైకి దాడికి దిగుతోంది. జెరూసలెం ప్రాంతాల్లో సైరన్ల మోతలు మోగాయి. అందరూ ఇళ్లలోనే ఉండాలని ఇజ్రాయిల్ పిలుపునిచ్చింది. ఇరాన్ ప్రయోగిస్తున్న మిస్సైళ్లను ఐరన్ డోమ్ వ్యవస్థతో సమర్థవంతంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇజ్రాయిల్ ఆదివారం చేసిన దాడిలో ఇరాన్ మంత్రిత్వశాఖ, ఆయిల్ క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటిలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ మొహమ్మద్ కజమీ, డిప్యూటీ చీఫ్ హసన్ మొహకిక్ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్ లో ఉన్న భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారు జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయిల్ దాడులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది.

హౌతీకి అణ్వాయుధాలు అప్పగించే కుట్ర

ఇజ్రాయిల్ ఆయిల్ క్షేత్రాలతో పాటు ఇరాన్ లోని ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేస్తోందని ఇరాన్ ప్రకటించింది. తాజాగా చేసిన దాడిలో ఇరాన్ లోని సహరన్ పట్టణంలోని ఆయిల్ క్షేత్రాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. అపీషియల్స్ ఉండే భవనాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేస్తోందని వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయంగా వస్తున్న సూచనలను తోసిపుచ్చారు. టెల్ అవీవ్ తన సైనిక లక్ష్యాలను కొనసాగిస్తుందన్నారు. ఫాక్స్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ.. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ అణ్వాయుధాలను బదిలీ చేయాలనే ప్రణాళికలను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు బయటపెట్టాయని ఆయన ఆరోపించారు. ఇరాన్ దాడిలో టెల్ అవీవ్‌కు దక్షిణంగా ఉన్న బాట్ యామ్‌లోని ఒక ఎత్తైన అపార్ట్‌మెంట్‌ను క్షిపణి ఢీకొట్టడంతో 10 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల బాలికతో సహా కనీసం ఆరుగురు మరణించారని ఇజ్రాయిల్ అధికారికంగా ప్రకటించింది. మరో 180 మంది గాయపడ్డారని తెలిపింది.

Next Story