కర్ణాటకలో ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌పై అత్యాచారం.. ముగ్గురికి మరణ శిక్ష

by Ramesh Naini |

పర్యాటక ప్రాంతం హంపి సమీపంలో విదేశీ పర్యాటకులపై జరిగిన దాడి, అత్యాచారం, హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష పడింది

కర్ణాటకలో ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌పై అత్యాచారం.. ముగ్గురికి మరణ శిక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని పర్యాటక ప్రాంతం హంపి సమీపంలో విదేశీ పర్యాటకులపై జరిగిన దాడి, అత్యాచారం, హత్య కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మల్లేష్ (హండి మల్లేష్), చైతన్య సాయి, శరణప్పలకు మరణ శిక్ష విధిస్తూ గంగావతి లోని జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 6న వారిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, ఇవాళ (సోమవారం) శిక్షా కాలాన్ని ఖరారు చేసింది.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2025, మార్చి 6వ తేదీ రాత్రి ఇజ్రాయెల్‌కు చెందిన ఓ యువతి, అమెరికాకు చెందిన యువకుడు, నాసిక్‌కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్‌లు హంపీ పర్యటనకు వచ్చారు. రాత్రి సమయంలో సణాపుర చెరువు సమీపంలోని తుంగభద్ర కాలువ వద్ద వారు సంగీత కార్యక్రమం జరుపుకుంటుండగా.. నిందితులు ముగ్గురు అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్ కావాలని అంటూ మాట కలిపిన నిందితులు, ఆపై డబ్బులు ఇవ్వాలని పర్యాటకులపై ఒత్తిడి తెచ్చారు. పర్యాటకులు నిరాకరించడంతో ఆగ్రహించిన నిందితులు.. వారిపై దాడి చేసి పంకజ్, డేనియల్, బిబాస్‌లను కాలువలోకి నెట్టేశారు. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన బిబాస్ నీటి ఉధృతికి గల్లంతై మరణించగా, మిగిలిన వారు అతి కష్టంతో ఒడ్డుకు చేరుకున్నారు.

వేగవంతమైన విచారణ.. అరుదైన తీర్పు

అనంతరం నిందితులు అక్కడే ఉన్న ఇజ్రాయెల్ యువతితో పాటు మరో భారతీయ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెళ్తూ వెళ్తూ వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ కేసును అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక ఈ కేసును విచారించి, ఇది ‘అత్యంత అరుదైన కేసు’గా అభివర్ణించారు. ఘటన జరిగిన కేవలం 11 నెలల కాలంలోనే నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడటం గమనార్హం. ఈ తీర్పుపై పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story