Israeli strikes: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 103 మంది మృతి

by Shamantha N |

ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తోంది.

Israeli strikes: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 103 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తోంది. శనివారం అర్థరాత్రి శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపింది. దీంతో 103 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఖాన్‌యూనిస్‌లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26మంది మరణించారని గాజా ఆరోరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇకపోతే, మొత్తం 103 మంది మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలోని ఇంటిపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు.

శనివారం ఒక్కరోజే 150 మంది మృతి

మరోవైపు, శనివారం ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 450 మందికి గాయాలయ్యాయని గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి 3 వేల మందికిపైగా పాలస్తీనియన్లు చనిపోయినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నందున ఉత్తర గాజాలోని ప్రధాన ఆసుపత్రిని మూసివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్ గ్రూప్ పౌర ప్రాంతాల నుండి పనిచేస్తున్నందున దాడుల వల్ల జరిగే పౌరుల ప్రాణనష్టానికి హమాస్‌దే బాధ్యత అని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, ఇటీవలే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇటీవల కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు తెలిపారు.

Next Story