గాజాలో యుద్ధం ఆపేందుకు సిద్ధం.. దోహాలో ప్రయత్నాలు చేస్తున్నాం: ఇజ్రాయెల్

by Phanindra |

గాజాలో యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనికోసం దోహాలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది.

గాజాలో యుద్ధం ఆపేందుకు సిద్ధం.. దోహాలో ప్రయత్నాలు చేస్తున్నాం: ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఈ విషయంపై కీలక ప్రకటన చేసింది. గాజా పోరాటాన్ని తాత్కాలికంగానో శాశ్వతంగానో ఆపేలా ఒప్పందం చేసుకునేందుకు దోహాలో ఉన్న ఇజ్రాయెల్ బృందం తీవ్రంగా కృషి చేస్తోందని పీఎంవో తెలిపింది. కొద్దిమంది బందీలను మార్చుకోవాలనే యూఎస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదనను కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తోందట. అందరు బందీలను తమకు అప్పగించేసి, హమాస్ ఉగ్రవాదులు లొంగిపోయి, గాజా నుంచి వెళ్లిపోతే ఈ యుద్ధం పూర్తిగా ముగుస్తుందని, ఈ ఒప్పందంపై కూడా ఇజ్రాయెల్ కసరత్తులు చేస్తోందని పీఎంవో వెల్లడించింది. హమాస్ వద్ద మొత్తం 58 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారని ఆ దేశ ప్రభుత్వం చెప్తోంది. వీరిలో కనీసం 23 మంది ప్రాణాలతో ఉన్నట్లు అంచనా.

ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన గతంలో ఆ దేశం వాదనకు భిన్నంగా ఉంది. హమాస్‌ను అంతం చేసే వరకు గాజాలో యుద్ధం ఆగదని కొన్నిరోజుల క్రితం వరకు ఇజ్రాయెల్ మొండిగా కూర్చుంది. అయితే తాజాగా ఈ యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈజిప్ట్, కతార్, యూఎస్‌కు చెందిన మధ్యవర్తులు ఈ యుద్ధాన్ని ఆపేందుకు మరోసారి చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల్లో హమాస్ లీడర్ మహమ్మద్ సిన్వర్ చనిపోయినట్లు వార్తలు రావడంతో ఈ శాంతి చర్చలు సాఫీగా సాగేది అనుమానమే.

Next Story