Israel: గాజాలో ఇజ్రాయెల్ భారీ దాడులు.. 68 మంది పాలస్తీనియన్లు మృతి

by B.Srinivas |

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. గాజా నగరంలో ఇజ్రాయెల్ మంగళవారం భూ దాడులను ప్రారంభించింది.

Israel: గాజాలో ఇజ్రాయెల్ భారీ దాడులు.. 68 మంది పాలస్తీనియన్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. గాజా నగరంలో ఇజ్రాయెల్ మంగళవారం భూ దాడులను ప్రారంభించింది. పలు ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో 68 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాలో భూ ఆపరేషన్ ప్రారంభించాయని తెలిపింది. ఆ ప్రాంత నివాసితులు గాజాను వీడాలని ఆదేశించింది. ఉగ్రవాద సంస్థ హమాస్ మౌలిక సదుపాయాలను కూల్చివేయడమే లక్ష్యంగా అటాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. తమ బలగాలు ప్రధాన నగరంలోకి లోతుగా కదులుతున్నాయని, రాబోయే రోజుల్లో 3,000 మంది హమాస్ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఐడీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రయెల్ కాట్జ్ స్పందించారు. ‘గాజా తగులబడుతోంది. బందీల విడుదల, హమాస్ ఓటమే లక్ష్యంగా సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారు. టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని పేర్కొ్న్నారు. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భేటీ అయిన మరుసటి రోజే గ్రౌండ్ ఇన్వేషన్ జరగడం గమనార్హం.

ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడింది: ఐరాస

ఇజ్రాయెల్ గాజాలో జెనోసైడ్‌కు పాల్పడిందని, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ఈ చర్యలను ప్రేరేపించారని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ తేల్చింది. విచారణ కమిషన్ చీఫ్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాజీ న్యాయమూర్తి నవీ పిళ్లే జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ.. గాజాలోని పాలస్తీనా సమూహాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో గత రెండేళ్లుగా ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలు బహిరంగంగా విస్మరించబడుతున్నాయని చెప్పారు. ఈ దారుణమైన నేరాలకు బాధ్యత ఇజ్రాయెల్ ఉన్నతాధికారులదేనని తెలిపారు. అయితే ఈ నివేదికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది.

Next Story